‘కేజీఎఫ్’ లాంటి సంచలన విజయం తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నుంచి సినిమా వస్తోందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ భారీ అంచనాల మధ్యే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘టాక్సిక్(Toxic)’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై తొలి రోజు నుంచి భారీ బజ్ ఏర్పడింది. మరి యశ్ అభిమానులను, సాధారణ ప్రేక్షకులను ఈ సినిమా ఎంతవరకు మెప్పించిందో చూస్తే..
గోవా నేపథ్యంగా సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇది. ఒక నేర ప్రపంచంలో పెరిగి, ఎదుగుతూ ఆ సామ్రాజ్యానికి డాన్‌గా మారే హీరో ప్రయాణమే ఈ చిత్ర కథాంశం. ‘కేజీఎఫ్(KGF)’లో అమ్మ సెంటిమెంట్ చుట్టూ కథ నడిస్తే, ఈ సినిమాలో అక్క(నయనతార) సెంటిమెంట్‌ను ప్రధాన బలంగా మలచాలని చూశారు. అయితే, కథాపరంగా చూస్తే ఇది చాలా రొటీన్, సాధారణమైన పాత గాథే అనిపిస్తుంది. కొత్తదనం కోరుకునే వారికి కథ నిరాశపరిచే అవకాశముంది.
కథ కంటే కేవలం యాక్షన్ ఎపిసోడ్స్, స్టైలిష్ మేకింగ్‌కే దర్శకురాలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. తెరపై నిత్యం నరుక్కోవడాలు, కాల్చుకోవడాలు, రక్తపాతం మధ్యలో రొమాంటిక్ సన్నివేశాలు జోడించారు. ఇవి కాస్త శృతిమించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి చూసేలా ఈ సినిమా లేదు.
ప్లస్ పాయింట్లు: యశ్ స్టైలింగ్, ఆయన మేనిరిజం, యాక్షన్ సీక్వెన్స్‌లు, అలాగే కియారా అద్వానీ(Kiara Advani)తో ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. హాలీవుడ్ స్థాయి సాంకేతిక విలువలు విజువల్స్ పరంగా రిచ్‌గా అనిపిస్తాయి.
మైనస్ పాయింట్లు: రొమాన్స్, వయలెన్స్ డోస్ ఎక్కువ కావడం, సెకండాఫ్ సాగదీత, క్లైమాక్స్ ఊహక అందేలా ఉండి విసుగు తెప్పించడం, అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) ఆశించిన స్థాయిలో లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్‌గా మారాయి.
ఇక ప్రేక్షకులు, నెటిజన్ల నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. యశ్(Yash) స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఒక్కసారి థియేటర్లలో చూడొచ్చు కానీ, ‘కేజీఎఫ్’ స్థాయి మాస్ మ్యాజిక్‌ను మాత్రం ఈ సినిమా పూర్తిగా రిపీట్ చేయలేకపోయింది.