టాలీవుడ్‌లో విషాదం.. చిరంజీవి క్లోజ్‌ఫ్రెండ్ క‌న్నుమూత‌

admin
Published by Admin — August 27, 2026 in Movies
News Image

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు(GV Narayana Rao) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన, బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ దిగ్భ్రాంతికర వార్తతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది.

కృష్ణా జిల్లా కురుమద్దాలికి చెందిన నారాయణ రావు ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. నటనపై మమాలంతో మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్న ఆయన బ్యాచ్‌లో అప్పట్లోనే సూపర్‌స్టార్ రజనీకాంత్ క్లాస్‌మేట్‌గా ఉన్నారు. అంతేకాదు, మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తోనూ ఆయనకు విడదీయరాని స్నేహబంధం ఉంది. నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన తొలి చిత్రంతోనే నంది అవార్డును అందుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం.

నటుడిగా, నిర్మాతగా విజయవంతమైన ప్రస్థానం
దాదాపు ఐదు దశాబ్దాల పాటు సాగిన ఆయన ప్రస్థానంలో వందకు పైగా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. కేవలం నటనకే పరిమితం కాకుండా పలు విజయవంతమైన చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. కేవలం వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

ఆయన మృతి పట్ల `మా(MAA)` తో పాటు పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమ ఒక మంచి నటుడిని, గొప్ప వ్యక్తిన కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవీ నారాయణ రావు భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు, నూతన, సీనియర్ నటీనటులు తరలివెళ్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా వేదికగా సంతాపం వెల్లువెత్తుతోంది.

Tags
GV Narayana Rao Tollywood RIP GV Narayana Rao Telugu Cinema Chiranjeevi MAA
Recent Comments
Leave a Comment

Related News