తెలుగు సినిమాకు సంబంధించి అతి పెద్ద పండుగ సీజన్ అంటే.. సంక్రాంతినే. ఆ తర్వాత అంత క్రేజ్ ఉన్నది దసరాకే. ఆ టైంలో రెండు వారాల దాకా స్కూళ్లు, కాలేజీలు సెలవులుంటాయి. పండుగ జోష్ ఉంటుంది. కుటుంబ ప్రేక్షకులు సినిమాలు చూసే జోష్లో ఉంటారు. ఈ టైంలో మంచి సినిమాలు పడితే వసూళ్ల మోత మోగుతుంది. ఐతే ఈ దసరాకు క్రేజీ సినిమాలే బరిలో ఉన్నప్పటికీ.. వాటికి హైప్ అయితే ఆశించిన స్థాయిలో లేదు.
పండుగ బరిలో ఉన్న రెండు పెద్ద సినిమాలు జైలర్-2, రణబాలి చిత్రాల విషయానికే వస్తే.. వీటిలో ఉన్న స్టార్ పవర్, బడ్జెట్లు, కథాంశాలను బట్టి చూస్తే హైప్ వేరే లెవెల్లో ఉండాలి. కానీ ఈ చిత్రాల అడ్వాన్స్ బుకింగ్స్ అంచనాలకు తగ్గట్లు లేవు. మామూలుగా రజినీకాంత్ సినిమా అంటే తెలుగులో కూడా మంచి బజ్ ఉంటుంది కానీ.. ‘జైలర్’ లాంటి బ్లాక్ బస్టర్కు సీక్వెల్ అయినప్పటికీ ‘జైలర్-2’ మీద మరీ అంచనాల్లేవు. దీని ప్రోమోలు, పాటలు అంచనాలకు తగ్గట్లు లేకపోవడం ఒక మైనస్ అయితే.. ఏపీలో ఈ చిత్రానికి టికెట్ల ధరలు పెంచడం ఓవరాల్గా ప్రేక్షకుల్లో నెగెటివిటీని పెంచిన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐతే నెల్సన్, రజినీ, అనిరుధ్ కలిసి ఏదో మ్యాజిక్ చేసి ఉంటారనే భావిస్తున్నారు.
ఇక విజయ్ దేవరకొండ సినిమా ‘రణబాలి’ విషయానికి వస్తే ఈ సినిమా కాన్సెప్ట్, ప్రోమోలు బాగున్నా సరే.. ఎందుకోగానీ హైప్ క్రియేటవ్వలేదు. విజయ్ దేవరకొండ వరుస ఫెయిల్యూర్ల ప్రభావం దీని మీద పడ్డట్లుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. ఓవర్సీస్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ డల్లుగా ఉన్నాయి. కానీ దర్శకుడు రాహుల్ సంకృత్యన్, విజయ్ దేవరకొండలను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మరోవైపు దసరా బరిలో ఉన్న చిన్న సినిమాలు క్రేజీ కళ్యాణం, గరివిడి లక్ష్మి గురించి అయితే అసలు డిస్కషనే లేదు. పెద్ద సినిమాలకే ఆశించిన హైప్ లేదంటే.. వీటి సంగతి చెప్పాల్సిన పని లేదు.
వాటి వాటి స్థాయిలో అన్ని సినిమాల పరిస్థితీ కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. వీటన్నింటికీ టాక్ అన్నది చాలా కీలకంగా మారింది. ఆప్షన్లు చాలా ఉన్న నేపథ్యంలో బెస్ట్ టాక్ తెచ్చుకునే సినిమాలకు ప్లస్ అవుతుంది. టాక్ రాని సినిమాలకు దెబ్బ గట్టిగానే ఉంటుంది. కాబట్టి దసరా సినిమాలకు టాక్ చాలా కీలకంగా మారనుంది. ఏ చిత్రం కూడా జస్ట్ ఓపెనింగ్స్తో గట్టెక్కేసే పరిస్థితి లేదు.