టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక్క చర్చ నడుస్తోంది. విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం’ (హౌస్ నంబర్ 47) పరిస్థితి ఏంటనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. భారీ అంచనాల మధ్య మొదలైన ఈ సినిమా చుట్టూ ఇప్పుడు సస్పెన్స్ మేఘాలు అలుముకున్నాయి. అసలు ఈ ప్రాజెక్ట్ ట్రాక్‌లో ఉందా లేక సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయిందా అన్న అనుమానాలు సినీ వర్గాల్లో తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి.
అసలైతే ఆదర్శ కుటుంబం(Aadarsha Kutumbam) మూవీని అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కారణంగా ఆ తేదీకి రాలేకపోయింది. ఆ తర్వాత అక్టోబర్ 9కి వాయిదా పడింది. ఆ డేట్ కూడా మిస్ కావడంతో అసలు సినిమా ఎప్పుడొస్తుందనేదానిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇండస్ట్రీలో మాత్రం అక్టోబర్ 30న విడుదల చేయబోతున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఆ తేదీకి మరో పదిహేనే రోజులు మాత్రమే సమయం ఉన్నా, కనీసం చిన్నపాటి అప్డేట్ కూడా బయటకు రాకపోవడం గమనార్హం.
సాధారణంగా త్రివిక్రమ్(Trivikram) సినిమాలకు ఉండే హైప్ వేరు. రిలీజ్‌కు కనీసం రెండు వారాల ముందు నుంచే ప్రమోషన్ల హోరు మోగాలి. కానీ ఇక్కడ మాత్రం కనీసం ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్ లేదా ఒక సాంగ్ కూడా వదిలిన దాఖలాలు లేవు. మరోవైపు ప్రొడ్యూసర్ నాగవంశీ ఇతర ప్రాజెక్టుల పనుల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమాపై ఫోకస్ తగ్గిందనే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎంత నిలదీస్తున్నా, మేకర్స్ నుంచి స్పందన కరువైంది. పండగ సమయం దగ్గరపడుతున్న తరుణంలోనైనా ఈ అడ్రస్ లేని సినిమాపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.