తెలుగు చిత్ర పరిశ్రమకు కంటిమీద కునుకు లేకుండా చేసే పేరు ఐబొమ్మ(iBomma). ఎన్నిసార్లు అడ్డుకున్నా, ఎన్ని డొమైన్లు బ్లాక్ చేసినా.. ఏదో ఒక రూపంలో మళ్లీ ప్రత్యక్షమవుతూ టాలీవుడ్ నిర్మాతలకు సవాల్ విసురుతోంది. తాజాగా ఈ పైరసీ వెబ్‌సైట్ మరోసారి యాక్టివ్ అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. దీని వెనుక ఉన్న అసలు సూత్రధారి అరెస్ట్ అయ్యారని సంబరపడేలోపే, కొత్త లింకులతో ఐబొమ్మ రీ-ఎంట్రీ ఇవ్వడం టాలీవుడ్ పెద్దలను షాక్‌కు గురిచేస్తోంది.
కొన్ని నెలల క్రితం సైబరాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఐబొమ్మ వెనుక ఉన్న కీలక వ్యక్తి రవి(Ravi)ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ పైరసీ పీడ వదిలిపోయిందని అంతా భావించారు. కానీ, ఆయన బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్దిరోజులకే సైట్ మళ్లీ యాక్టివ్ కావడం గమనార్హం. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సినిమాలతో పాటు, ప్రముఖ ఓటీటీల్లో విడుదలైన లేటెస్ట్ కంటెంట్‌ను కూడా ఐబొమ్మ ఎక్కడా తగ్గకుండా అప్‌లోడ్ చేస్తోంది.
పోలీసుల నిఘా కళ్ళ ముందే ఈ సైట్ మళ్లీ ఆపరేట్ అవుతుండటం వెనుక భారీ కుట్ర దాగి ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ఏదైనా అంతర్జాతీయ నెట్‌వర్క్ ఉందా? లేదా విదేశీ సర్వర్ల ద్వారా దీన్ని నిర్వహిస్తున్నారా? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ఒక వ్యక్తిని పట్టుకుంటే ఆగిపోయేది కాదని, దీని వేళ్లు చాలా లోతుగా ఉన్నాయని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
ఒక సినిమాను నిర్మించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంటే, ఐబొమ్మ(iBomma) వంటి సైట్లు విడుదలైన గంటల్లోనే పైరసీ ప్రింట్లను అందుబాటులోకి తెస్తూ నిర్మాతలకు భారీ నష్టాలను మిగులుస్తున్నాయి. మరి ఈ సారి పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో, ఈ పైరసీ భూతాన్ని శాశ్వతంగా ఎలా అంతం చేస్తారో వేచి చూడాలి.