మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి.. తాజాగా ఆదివారం కోనసీమ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే.. ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనకు, ప్రస్తుత కూటమి పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రస్తావించారు. అయితే.. ఎక్కడా వైసీపీ పేరును కానీ, జగన్ పేరును కానీ ఆయన ప్రస్తావించలేదు. కానీ.. `గత పాలన` అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీలో కూటమిప్రభుత్వ పాలన చాలా బాగుందని వ్యాఖ్యానించారు.
గతంలో అభివృద్ధి ఎక్కడిదక్కడే ఉండేదన్న విమర్శలు తన వరకు కూడా వచ్చాయని చిరంజీవి వ్యాఖ్యానించారు. అయితే.. ఇప్పుడు చాలా పెట్టుబడులు వస్తున్నాయని. ఉద్యోగాలుకూడా లభిస్తున్నాయని ఇది చాలా మంచి పరి ణామమని ఆయన వ్యాఖ్యానించారు. ``రోడ్లు కూడా బాగున్నాయి. ఇది చూసి ముచ్చటేసింది.`` అని వ్యాఖ్యానించా రు. గత వైసీపీ హయాంలో రహదారులు బాగోలేదన్న వాదన ఉన్న విషయం తెలిసిందే. అనేక విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఇక, ప్లాస్టిక్ వినియోగం, పరిసరాల పరిరక్షణకు సంబంధించి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని చిరు కోరారు. పర్యావరణాన్ని ప్లాస్టిక్ తినేస్తోందని.. దీని గురించి అందరూ తెలుసుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వాలకు మాత్రమే పరిమితమైన అంశం కాదన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తోందని.. ప్లాస్టిక్ కట్టడికి కూడా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కాగా.. చాలా ఏళ్ల తర్వాత చిరు కోనసీమలో పర్యటించడంతో అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు.