ఢిల్లీలో మోదీకి చంద్రబాబు రిక్వెస్ట్

admin
Published by Admin — October 08, 2026 in Andhra
News Image
ఏపీ సీఎం చంద్రబాబు వరుస భేటీలతో ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, నిధులు, పలు అంశాలే ఎజెండాగా ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలవురు కేంద్ర మంత్రులను ఆయన కలిశారు. మోదీతో భేటీ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై కేంద్రం దృష్టి సారించాలని ప్రతిపాదన చేశారు. ఎన్డీఏ హయాంలోనే రహదారుల నెట్వర్క్, పవర్ గ్రిడ్ సాధ్యమయ్యాయని, అదే స్ఫూర్తితో నదుల అనుసంధానం చేసే "వాటర్ గ్రిడ్" ఏర్పాటు చేయాలని సూచించారు. 

ఎల్‌నినో వల్ల రాష్ట్రంలో 53 శాతం లోటు వర్షపాతం నమోదైందని, రైతులపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. కరువు నష్టాన్ని తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. 
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర సహకారం అందించాలని సీఎం కోరారు. ముఖ్యంగా, రాజధాని అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం వంటి వాటికి సహకరించాలని కోరారు.

కాగా, కేంద్ర ఓడరేవులు, నౌకాయాన శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌తో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. పోర్టుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టులో కొత్తగా టెర్మినల్ ఏర్పాటు, దుగరాజపట్నంలో షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ఏర్పాటు వంటి కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సుదీర్ఘ తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
Tags
pm modi AP CM Chandrababu meeting Delhi funds projects
Recent Comments
Leave a Comment

Related News