ప‌వ‌న్ ఎంట్రీ.. ఆ జ‌న‌సేన MLA క‌థ క్లోజ్‌..!

admin
Published by Admin — October 09, 2026 in Politics, Andhra
News Image

ఏపీ పాలిటిక్స్‌లో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) మరోసారి తన మార్క్ పాలనకు శ్రీకారం చుట్టారు. అధికారంలోకి వచ్చాం కదా అని సొంత పార్టీ నాయకులు హద్దులు దాటినా, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నడుచుకున్నా ఉపేక్షించేది లేదని స్పష్టమైన సందేశమిచ్చారు. పోలవరం నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వ్యవహార శైలిపై గత కొంతకాలంగా వస్తున్న ఆరోపణలను అధిష్ఠానం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ నేరుగా రంగంలోకి దిగి సంచలన నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పారదర్శక పాలనపై పవన్ ప్రత్యేక దృష్టి సారించారు. 'అడవితల్లి బాట' వంటి కార్యక్రమాల ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో జనసేన(Janasena) ఇమేజ్‌ను పెంచేందుకు శ్రమిస్తుంటే, స్థానిక ప్రజాప్రతినిధి ప్రవర్తన మాత్రం పార్టీకి మింగుడు పడనిదిగా మారింది. బాలరాజు తీరుపై గతంలోనే పవన్‌కు ఫిర్యాదులు అందగా, ఆయనను స్వయంగా పార్టీ కార్యాలయానికి పిలిపించి కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. గిరిజనుల సంక్షేమానికి అంకితం కావాలని, అవినీతికి దూరంగా ఉండాలని గట్టిగానే స్పష్టం చేశారు. అయితే, అధినేత ఇచ్చిన హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవడం, ప్రవర్తనలో మార్పు రాకపోవడమే ఇప్పుడు ఆయన పదవికి ఎసరు తెచ్చింది.

తాజాగా పోల‌వ‌రం మ‌ట్టి మాఫియా వ్య‌వ‌హారంలో బాల‌రాజు(Chirri Balaraju)  పేరు తెర‌పైకి రావ‌డం.. ఎమ్మెల్యే గారు స్వ‌యంగా రంగంలోకి దిగి సెటిల్‌మెంట్ చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం వివాదంగా మారింది. మట్టి మాఫియాకు అండగా నిలుస్తూ పంచాయితీలు చేయడం ఏంటని స్థానికుల నుంచి విమర్శలు రావ‌డంతో పవన్ కల్యాణ్ తీవ్ర విసుగు చెందారు. తప్పు చేస్తే సొంత పార్టీ నేతలైనా సరే వదిలేది లేదంటూ, బాలరాజుపై వచ్చిన ఆరోపణల నిజానిజాలు తేల్చేందుకు ఏకంగా ఒక ఉన్నత స్థాయి కమిటీని రంగంలోకి దించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో సమగ్రంగా విచారించి, నివేదికను పవన్ కల్యాణ్‌కు సమర్పించనుంది. నివేదిక వచ్చిన వెంటనే ఎమ్మెల్యేపై కఠిన చర్యలు ఉంటాయని జనసేన వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.

మొత్తానికి తప్పు చేసిన ప్రజాప్రతినిధి సొంత పార్టీకి చెందినవారైనా సరే సహించేది లేదనే పవన్ నిర్ణయం జనసేన శ్రేణుల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామంతో పోలవరం(Polavaram) ఎమ్మెల్యే చిర్రి బాలరాజు రాజకీయ భవిష్యత్తు డేంజ‌ర్ జోన్‌లో ప‌డింద‌నే చర్చ మొదలైంది. 

Tags
Chirri Balaraju Pawan Kalyan Palavaram MLA AP News Ap Politics Janasena
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News