ఏపీలో స్థానిక సంస్థల(లోకల్ బాడీ) ఎన్నికల వేడి రాజుకుంది. నిన్న మొన్నటి వరకు కోర్టుల కేసుల కారణంగా ఈ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న విషయంపై మీమాంస కొనసాగింది. అయితే.. తాజాగా సుప్రీంకోర్టు ఈ ఎన్నికలకు సంబంధించిన 2 కీలక పిటిషన్లను తోసిపుచ్చింది. దీనిలో 1) వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి సహా.. కర్నూలు మాజీ మేయర్ దాఖలు చేశారు. 2వది.. ఏపీ ప్రభుత్వమే దాఖలు చేసిన పిటిషన్. ఈ రెండు పిటిషన్లనుకూడా కోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు.. స్థానిక ఎన్నికలను నిర్వహించుకునే స్వేచ్ఛను కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది.
టీడీపీ కూటమి..
టీడీపీ నేతృత్వంలోని కూటమి పార్టీలు స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే రెండున్నరేళ్లలో చేసిన సంక్షేమంతోపాటు.. మహిళలకు, ఇతర సామాజిక వర్గాలకు చేసిన మేళ్లను కూడా వివరించి.. ఎన్నికల్లో విజయం ఏకపక్షంగా సాగాలని నిర్ణయానికి వచ్చాయి. ఇక, కూటమిలో ఎక్కడా కలహాలకు అవకాశం లేకుండా కూడా అడుగులు వేస్తున్నారు. స్థానికంగా ఆయా పార్టీల నాయకుల మధ్య పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టీడీపీ, జనసేనలు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి.. నాయకులు, కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.
వైసీపీ..
ఇక, ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ కూడా ఈ ఎన్నికలను కీలకంగా భావిస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వచ్చిన తొలి ఎన్నికలు కావడం, స్థానికంగా ఈ ఎన్నికలు పార్టీకి అత్యంత కీలకంగా మారడంతో వైసీపీ కూడా దీనినిసవాల్గానే తీసుకుంది. ప్రధానంగా పార్టీ నుంచి నాయకులు వెళ్లిపోయినా.. పార్టీ అస్తిత్వం మాత్రం బలంగానే ఉందని చాటుకునేందుకు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మ కంగా తీసుకుంటోంది. అలానే.. గత ఎన్నికల సమయంలో వైసీపీకి 40 శాతానికి పైగా వచ్చిన ఓటు బ్యాంకును ఇప్పుడు కాపాడుకునే ప్రయత్నంలోనూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వరాదన్న జగన్ నిర్ణయం మేరకు నాయకులు బలంగానే పనిచేస్తు న్నారు.
అమీ-తమీ..
ఇక, బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశం మాత్రంఎన్నికల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య ప్రధాన ప్రచార అస్త్రంగా మారుతోంది. బీసీల అభ్యు న్నతిని దృష్టిలో పెట్టుకుని తాము 34 శాతం రిజర్వేషన్ కల్పించామని.. ఇప్పుడు దానిని వైసీపీ కోర్టులో సవాల్ చేయడం ద్వారా బీసీలకు వెన్నుపోటు పొడించిందని టీడీపీ చెబుతోంది. ఇక, వైసీపీ కూడా దీనిపై తన బాణీని వినిపిస్తోంది. బీసీలకు తామే మేలు చేశామని.. అధికారంలో ఉన్నప్పుడు అనేక పదవులు ఇచ్చామనిచెబుతోంది. అదేసమయంలో రిజర్వేషన్లు అనేవి 50 శాతానికి(మొత్తం) మించరాదని తెలిసి కూడా టీడీపీ 34 శాతం ఇచ్చి.. బీసీలకు మోసం చేసిందని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇలా.. ఇరు పక్షాల మధ్య ఈ ఎన్నికలు తీవ్ర రాజకీయాలకు దారితీస్తున్నాయి.