సాయిరెడ్డి కొత్త పార్టీకి బ్రేక్..!

admin
Published by Admin — October 12, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న పరిణామాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వైసీపీతో తెగతెంపులు చేసుకుని, కొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన నిర్ణయాన్ని కొద్దికాలం పాటు వాయిదా వేశారు. దసరా పండుగ వేళ కొత్త పార్టీ పేరు, జెండా, ఎజెండాను ప్రకటిస్తారని అంతా భావించిన తరుణంలో, ఆయన చేసిన తాజా ప్రకటన పొలిటికల్ సర్కిల్స్‌లో సరికొత్త చర్చకు తెరలేపింది. మంగళవారం నుంచి వారం రోజుల పాటు ఆయుర్వేద చికిత్స నిమిత్తం వెళ్తున్నానని, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే పార్టీ ఆవిర్భావ తేదీని వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు.

గత కొద్ది వారాల సాయిరెడ్డి కదలికలను పరిశీలిస్తే ఆయన వ్యూహంలో వేగం స్పష్టంగా కనిపించింది. విజయవాడ(Vijaywada)లో మొదలైన ఆయన ప్రాంతీయ పర్యటనలు.. అనంతపురం, విశాఖపట్నం మీదుగా తిరుపతి వరకూ సాగాయి. ప్రతిచోటా మీడియా సమావేశాలు పెడుతూ, కీలక అంశాలపై గళం వినిపిస్తూ వచ్చిన సాయిరెడ్డి, సరిగ్గా పార్టీ లాంచ్ ముహూర్తం దగ్గర పడేసరికి సైలెంట్ కావడం గమనార్హం. 

ఒకప్పుడు వైఎస్సార్‌సీపీ(YSRCP)లో అత్యంత కీలకనేతగా, కేంద్రాన్ని శాసించే రాజ్యసభ సభ్యుడిగా చక్రం తిప్పిన సాయిరెడ్డి రాజకీయ ప్రయాణం ఆసక్తికర మలుపులు తిరుగుతూ వస్తోంది. గతేడాది రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన.. ఇకపై రాజకీయాల నుంచి తప్పుకుని, పూర్తిగా వ్యవసాయానికే అంకితమవుతానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత కొద్ది నెలలకే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని కొత్త రాజకీయ పార్టీతో పాటు మీడియా సంస్థను స్థాపిస్తానని ప్రకటించి అందరినీ విస్మయానికి గురిచేశారు.

ఇక ప్రస్తుతం ఆయన పార్టీ ప్రకటన వాయిదా వెనుక బలమైన రాజకీయ లెక్కలే ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో, హడావుడిగా పార్టీ పెట్టి ఎన్నికల్లోకి దిగడం కంటే.. క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయడమే మేలని ఆయన భావించినట్లు తెలుస్తోంది. ఆయుర్వేద చికిత్సను ఒక కారణంగా చూపినప్పటికీ, స్థానిక ఎన్నికల ఫలితాలు, రాజకీయ సమీకరణాలు మారే తీరును బట్టి తన తదుపరి కార్యాచరణను ఖరారు చేయాలని విజయ సాయిరెడ్డి(Vijayasai Reddy) ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి, దసరా బరిలో దూకాల్సిన సాయిరెడ్డి రథం తాత్కాలికంగా ఆగిపోయింది.. ఎన్నికల కోడ్ ముగిశాక ఆయన పెట్టబోయే కొత్త అడుగు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Tags
Vijayasai Reddy AP Politics Andhra Pradesh Vijayasai Reddy Political Party YSRCP AP Local Body Elections
Recent Comments
Leave a Comment

Related News