దుల్కర్ సల్మాన్ మంచి మంచి సినిమాలు చేస్తాడు కానీ.. వాటి రిలీజ్ ప్లానింగ్ మాత్రం సరిగా ఉండదనే విమర్శ ఉంది. గతంలో తన చిత్రాలు కొన్ని ప్లానింగ్ లోపం వల్ల రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ‘ఐమ్ గేమ్’ విషయంలో మరింత ఇబ్బంది తప్పలేదు. ఇండిపెండెన్స్ డే వీకెండ్లోనే రావాల్సిన ఈ చిత్రం.. ఏవో కారణాలతో వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. చివరికి ఈ గురువారం రిలీజ్‌కు సినిమాను రెడీ చేశారు.
కానీ ఈ రోజు ఉదయం తెలుగు రాష్ట్రాల్లో ‘ఐమ్ గేమ్’ షోలు పడలేదు. మలయాళ వెర్షన్ షోలు మాత్రం యథాప్రకారం మొదలయ్యాయి కానీ.. తెలుగు వెర్షన్ విషయంలో ఏదో ఇబ్బంది తలెత్తింది. ఉదయం ప్రెస్ షోకు వెళ్లిన మీడియా ప్రతినిధులకు.. అలాగే మిగతా థియేటర్లలో రెగ్యులర్ షోలు చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులకు తిరస్కారం తప్పలేదు. కంటెంట్ రాలేదని షోలు క్యాన్సిల్ చేశారు.
మధ్యాహ్నానికి అయినా షోలు మొదలవుతాయేమో అని ఆశించారు దుల్కర్ ఫ్యాన్స్. కానీ అదీ జరగలేదు. ఆ షోలు కూడా ఆగిపోయాయి. రాత్రి షోలకు బుకింగ్స్ బాగానే ఉన్నాయి కానీ.. ఆ షోలైనా పడతాయో లేదో తెలియట్లేదు. టీం ఆలస్యానికి క్షమాపణలు చెప్పింది. వీలైనంత త్వరగా షోలు పడతాయంటోంది కానీ.. ఏం జరుగుతుందో క్లారిటీ లేదు. మరోవైపు మలయాళంలో ‘ఐమ్ గేమ్’కు రివ్యూలు బాగానే ఉన్నాయి.
సినిమాలో ఫస్టాఫ్ సూపర్ అంటున్నారు. సెకండాఫ్ యావరేజ్ అనే టాక్ వస్తోంది. దుల్కర్ పెర్ఫామెన్స్ సూపర్ అనే టాక్ వస్తోంది. దీంతో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఎగ్జైట్ అవుతున్నారు. కానీ సినిమాకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో తెలియట్లేదు. నహాస్ హిదాయత్ రూపొందించిన ఈ చిత్రాన్ని దుల్కర్ స్వయంగా నిర్మించడం విశేషం. ‘అంగామలై డైరీస్’ ఫేమ్ ఆంటోనీ వర్గీస్ ఇందులో కీలక పాత్ర పోషించాడు.