వైఎస్ రాజశేఖరరెడ్డి. ఉమ్మడి ఏపీలో 5 సంవత్సరాల 7 మాసాలు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ, కాంగ్రెస్ పార్టీని తనదైన శైలిలో శాసించిన నాయకుడిగా.. జాతీయ పార్టీని సైతం.. ఒక ప్రాంతీయ నేత నియంత్రిం చగల శక్తిఉంటుందన్న రీతిలో నిరూపించిన నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. విస్తృత అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీలో 2004 తర్వాత.. ఏకఛత్రాధిపత్యంగా వైఎస్ చేసిన రాజకీయాలు పార్టీ దశ దిశను కూడా మార్చేశాయి.
దీనికి కారణం.. ఎవరు ఏం చెప్పినా.. వినడం, ఎవరు ఏం చేసిన చూడడం.. వాటిలో మంచిని తీసుకోవడం.. చెడును వదిలి పెట్టడం.. వారిని సమస్ఫూర్తిగా ఓదార్చడం.. పనిని సానుకూలం చేసుకోవడం.. ఇవీ.. నాడు వైఎస్ అనుసరించిన మేలిమి సూత్రాలు. ఫలితంగా కాంగ్రెస్‌లో వైఎస్ ను వ్యతిరేకించిన రెడ్డి నాయకులు కూడా ఆయన వెంట నడిచేలా పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునేలా చేశాయి. మరి ఇప్పుడు ఆయన కుమారుడిగా జగన్ ఏం చేస్తున్నారు? పార్టీని పెట్టి.. వైఎస్ పేరుతో ఐదేళ్లు పాలన సాగించిన ఆయన.. నిజంగానే ఆయన బాటలో నడుస్తున్నారా? అన్నది ప్రశ్న.
పాలన ఎలా ఉన్నా.. పార్టీ బాగుండాలి- ఇదీ.. ఏ పార్టీ అయినా కోరుకునే ప్రధాన లక్ష్యం. అయితే.. వైసీపీలో ఇది కని పించడం లేదు. పైకి అంతర్గత ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని, నాయకులకు పూర్తి స్వేచ్ఛ ఉందని పైకి చెబుతున్నప్పటికీ.. సజ్జల రామకృష్నారెడ్డి చుట్టూ ఎందుకు రాజకీయ విమర్శలు వస్తున్నాయన్న ఆత్మ విమర్శ చేసుకునే పరిస్థితి పార్టీలో కనిపించడం లేదు. అంతేకాదు.. ``మేం చెబుతున్నాం.. మా నాయకుడు వింటేనా`` అని మావిగన్ విషయంపై ఉత్తరాంధ్రకు చెందిన మాజీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
ఇక, పార్టీ నుంచి పోయే వారు పోండి.. అని భీష్మించిన జగన్.. ఇది సరైందా? కాదా? అనే ఆత్మ విమర్శ కూడా చేసు కోలేదు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తన మాటే శాసనమని పైకి చెబుతున్నా.. చంద్రబాబు ఈవిషయంలో ఎంతో విజ్ఞతతోవ్యవహరిస్తున్నారు. ఆయనపై విమర్శలు రావొచ్చు.. కానీ, పార్టీ ప్రధానం. కార్యకర్తలు, నాయకులు ముఖ్యం .. అనే సూత్రాన్ని పాటిస్తున్నారు. ఇదే గతంలో వైఎస్ కూడా అనుసరించారు. కానీ, వైఎస్ జాడను అనుస రిస్తున్నా మని చెబుతున్నా.. జగన్ నీడలే.. నేడు పార్టీకి శాపంగా మారుతున్నాయన్నది పార్టీ నాయకుల అభిప్రాయం. వితం డవాదం.. జనాభిప్రాయానికి వ్యతిరేక నిర్ణయాలు వంటివి పార్టీకి గొడ్డలి పెట్టుగా మారాయన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.