మతం పేరుతో దాడి.. గుక్కపెట్టి ఏడ్చిన 'జాతిరత్నాలు' హీరోయిన్

admin
Published by Admin — August 16, 2026 in Movies
News Image

సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఏ చిన్న పని చేసినా అది కొందరికి వివాదాస్పదంగా మారుతుంటుంది. ముఖ్యంగా పండుగలు, సాంస్కృతిక వేడుకల్లో నటీనటులు పాల్గొంటే వచ్చే విమర్శలు కొన్నిసార్లు హద్దులు దాటుతుంటాయి. తాజాగా టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ, 'జాతిరత్నాలు(Jathi Ratnalu)' ఫేమ్ ఫరియా అబ్దుల్లాకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. హైదరాబాద్‌లో జరిగిన బోనాల పండుగలో ఉత్సాహంగా పాల్గొన్న ఆమె, కొందరి నెటిజన్ల విపరీతమైన ట్రోలింగ్ కారణంగా కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

నగరంలో వైభవంగా జరిగిన బోనాల(Bonalu) వేడుకల్లో ఫరియా సందడి చేసిన సంగతి తెలిసిందే. సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఆమె, హిందూ మహిళలతో కలిసి బోనం ఎత్తుకుని ఊరేగింపులో భాగమైంది. అంతేకాదు, జోరుగా సాగుతున్న పోతురాజుల ఉత్సాహానికి తగ్గట్టుగా వారి మధ్యలో నిలబడి ఎంతో ఆనందంగా డ్యాన్స్ కూడా చేసింది. ఈ వీడియోలు, ఫొటోలు క్షణాల్లో నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఈ వీడియోలను చూసిన ముస్లిం వర్గానికి చెందిన కొందరు నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వేరే మతానికి చెందినదై ఉండి హిందూ పండుగలో ఇలా చేయడం మతానికి మచ్చ తెచ్చినట్టేనని, ఆమెను 'కాఫిర్' అంటూ దారుణంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు.

తనపై వస్తున్న ఈ సోషల్ మీడియా(Social Media) దాడిని చూసి ఫరియా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కొందరి దురుసు కామెంట్లు ఆమెను ఎంతగానో బాధించడంతో గుక్కపెట్టి ఏడ్చేశారు. ఈ క్రమంలోనే తన ఆవేదనను వ్యక్తపరుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ వీడియోను పంచుకున్నారు. తన తండ్రి ఇస్లాం మతం పట్ల ఉన్న గౌరవంతో ఆ మార్గాన్ని ఎంచుకున్నారని, ఆ మతంలోని మంచి విషయాలనే తనకు నేర్పించారని ఆమె స్పష్టం చేశారు. తాను కూడా ఎప్పుడూ మంచినే చూశానని, తనను విమర్శిస్తున్న ప్రతి ఒక్కరిలోనూ మంచే జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఇక ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇస్తూ.. దేవుడిని, ప్రేమను కొన్ని కురుచ భావాలతో చూడవద్దని ఫరియా(Faria Abdullah) హితవు పలికారు. 'అల్లా' అంటే వెలుగు అని, అది అన్నింటినీ ఏకం చేస్తుందని గుర్తుచేశారు. అంత విశాలమైన భావనను కొందరి సంకుచిత ఆలోచనలతో ఎలా కుదించగలరని ఆమె సూటిగా ప్రశ్నించారు. తనపై ద్వేషాన్ని ప్రదర్శిస్తున్న వారికి సైతం తాను ప్రేమను పంచుతానని, వారి మంచి కోసమే ప్రార్థిస్తానని చెబుతూ ఆమె కంటతడి పెట్టారు. ఏదేమైనా, కేవలం పండుగలో ఆనందంగా గడిపినందుకు ఓ నటిని ఇలా మతం పేరుతో వేధించడం పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

https://www.instagram.com/reel/DcDfIwZRSeD/?utm_source=ig_embed&ig_rid=AE--WwAMdMmsSkHu_5sn8GJ

Tags
Faria Abdullah Bonalu Controversy Jathi Ratnalu Tollywood Viral Video Hyderabad Bonalu
Recent Comments
Leave a Comment

Related News