టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఊహించని షాక్ తగిలింది. ఆయన వ్యాపార భాగస్వామిగా ఉన్న ప్రముఖ మల్టీప్లెక్స్ 'AMB సినిమాస్'తో పాటు తెలంగాణలోని మరికొన్ని థియేటర్లపై వస్తు సేవల పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (GSTAT) కఠిన చర్యలు తీసుకుంది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి, ప్రేక్షకులను మోసం చేశారనే ఆరోపణలతో భారీ జరిమానా విధించింది.
నిజానికి ప్రభుత్వం సినిమా టికెట్లపై జీఎస్టీ(GST) రేట్లను తగ్గించినప్పుడు, ఆ లాభం నేరుగా ప్రేక్షకులకు చేరాలి. అంటే టికెట్ ధరలు తగ్గాలి. కానీ, AMB సినిమాస్‌తో సహా తెలంగాణలోని ఐదు థియేటర్ల యాజమాన్యాలు ఆ తగ్గింపు ప్రయోజనాన్ని ప్రేక్షకులకు అందించలేదు. తగ్గిన పన్ను శాతాన్ని తామే లాభంగా మార్చుకుంటూ, పాత ధరలకే టికెట్లు విక్రయించాయి. కేంద్ర జీఎస్టీ చట్టంలోని యాంటీ-ప్రాఫిటీరింగ్ నిబంధనల ప్రకారం ఇది తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణించబడుతుంది.
ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న జీఎస్టీ ట్రిబ్యునల్.. నిబంధనలు మీరిన థియేటర్లన్నీ కలిసి మొత్తం రూ. 1.7 కోట్లను వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని ఆదేశించింది. ఇందులో అత్యధికంగా మహేష్ బాబు(Mahesh Babu)కు చెందిన AMB సినిమాస్ రూ. 1.1 కోట్లు చెల్లించాల్సి రావడం గమనార్హం.
మిగతా థియేటర్ల వివరాలను పరిశీలిస్తే.. ఈ జాబితాలో కుమార్ 70MM థియేటర్‌కు రూ. 25 లక్షల పెనాల్టీ పడగా, సంగారెడ్డిలోని జ్యోతి థియేటర్ రూ. 19.8 లక్షలు చెల్లించాల్సి ఉంది. అలాగే భ్రమరాంబ సినిమాస్ 70MMకు రూ. 11.8 లక్షలు, ASR సినిమా LLPకి రూ. 9.6 లక్షలు, హైదర్‌నగర్‌లోని విశ్వనాథ్ సినిమా 70MM థియేటర్‌కు రూ. 9 లక్షల చొప్పున జీఎస్టీ ట్రిబ్యునల్ జరిమానా విధించింది. మొత్తానికి ప్రేక్షకుల జేబులకు చిల్లు పెడుతూ అక్రమంగా లాభపడినందుకు గాను ఈ జరిమానా విధించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ పరిణామం ఇప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీతో పాటు ట్రేడ్ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.