ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో నిలిచే టెక్కలి వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చుట్టూ ఇప్పుడు మరో హైడ్రామా నడుస్తోంది. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణకు హాజరయ్యేందుకు పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన ఆయన.. మార్గమధ్యంలోనే హఠాత్తుగా మాయమవ్వడం శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇల్లు వదిలి గంటలు గడుస్తున్నా ఆయన ఆచూకీ లభించకపోవడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అటు పోలీసులు, ఇటు జనం తలలు పట్టుకుంటున్నారు.
దువ్వాడ కనిపించకుండా పోయారనే వార్త బయటకు రాగానే.. ఆయన సహచరి దివ్వెల మాధురి తక్షణమే రంగంలోకి దిగారు. ఎమోషనల్ డైలాగులతో సీన్‌ను పూర్తిగా మార్చేశారు. దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas)ను పోలీసులే అక్రమంగా డిటైన్ చేసి, ఎటో తీసుకెళ్లిపోయారంటూ ఆమె సంచలన ఆరోపణలు గుప్పించారు. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందనే రేంజ్‌లో సింపతీ కార్డ్ ప్లే చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే, కొత్తూరు పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను స్ట్రాంగ్‌గా ఖండిస్తున్నారు. "ఆయన అసలు మా స్టేషన్‌కే రాలేదు.. మాకేం సంబంధం లేదు" అంటూ బలంగా చెబుతున్నారు.
ఈ మిస్టరీలో పోలీసుల వెర్షన్ కథను మరింత రక్తికట్టిస్తోంది. స్టేషన్‌కు బయలుదేరిన సమయంలో దువ్వాడ(Duvvada) వెంట ఆయన పర్సనల్ అసిస్టెంట్ కూడా ఉన్నాడు. కానీ, మార్గమధ్యంలోనే సడన్‌గా పీఏ కారు దిగి వెళ్ళిపోయాడని, ఆ తర్వాత దువ్వాడ ఒక్కడే కారు నడుపుకుంటూ ఎటో వెళ్ళిపోయాడని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఈ మిస్సింగ్ వెనుక ఏదో పెద్ద ప్లానింగే ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.
ఇదే తరుణంలో పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకోవడానికి, ముందస్తు బెయిల్ ప్రయత్నాల కోసం ఎక్కడో సేఫ్‌గా దాక్కుని.. బయట మాత్రం కిడ్నాప్ చేశారు, ఎన్‌కౌంటర్ చేస్తారేమో అంటూ మాధురి(Madhuri)తో డ్రామా రక్తికట్టిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. స్టేషన్‌కు వెళ్లే ముందే దువ్వాడ ఒక వీరోచిత వీడియోను రికార్డ్ చేసి వైరల్ చేయడం చూస్తుంటే.. ఇదంతా ముందే సిద్ధం చేసుకున్న బిగ్ బాస్ తరహా స్క్రిప్ట్ అని నెటిజన్లు నవ్వుకుంటున్నారు. మరి ఈ హైడ్రామాకు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో చూడాలి.