ఓటు పోతే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు పోతాయా..?

admin
Published by Admin — June 30, 2026 in Politics, National
News Image

ఓటు హక్కు అనేది కేవలం ఐదేళ్లకు ఒకసారి పోలింగ్ కేంద్రానికి వెళ్లి బటన్ నొక్కే ప్రక్రియ మాత్రమే కాదు.. అది మీ ఉనికిని చాటే ఒక ఆయుధం. ఒకవేళ నిర్లక్ష్యంతో ఆ ఓటును కోల్పోతే, భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా దూరం కావాల్సి వస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్(DK Shivakumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తాజాగా ప్రారంభమైన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ నేపథ్యంలో ఆయన ప్రజలను అప్రమత్తం చేశారు. ఓటును కేవలం ఒక హక్కుగా కాకుండా, జీవించే హక్కుగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఓటరు(Voter) జాబితాలో పేర్లు లేని వారిని, అర్హత లేని వారిని గుర్తించి ఏరివేసే ప్రక్రియ దేశవ్యాప్తంగా ఊపందుకుంటోంది. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే ఓటరు సవరణ జాబితా ఆధారంగానే అర్హత లేని రేషన్ కార్డుదారులను ఏరిపారేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారని డి.కె.శివకుమార్ గుర్తు చేశారు. మిగిలిన రాష్ట్రాలు సైతం ఇదే వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయని, కాబట్టి ఓటు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వ ప్రయోజనాలు వాటంతట అవే కట్ అయిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.

ఇక‌పోతే ఈ ఓటరు సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం(Election Commission) రంగంలోకి దిగింది. జులై 29 వరకు అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలను సేకరించనున్నారు. ఈ తనిఖీల్లో ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకు వీలుగా కర్ణాటక ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల సౌకర్యార్థం ఆన్‌లైన్ ద్వారా, అలాగే సేవా కేంద్రాల ద్వారా శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తోంది. ఓటర్లు తమ నివాస ఆధారాలను నిరూపించుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడనుంది.

ఇంటింటి సర్వే సమయంలో ప్రజల నుంచి ఎలాంటి ఒరిజినల్ పత్రాలను సేకరించబోమని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. కేవలం ఫారమ్‌ను పూర్తిగా నింపి, సంతకం చేసి ఇస్తే సరిపోతుందని తెలిపారు. ఎవరూ ఎలాంటి అపోహలకు లోనుకావద్దని, ఇదంతా నిబంధనల ప్రకారమే జరుగుతుందని హామీ ఇచ్చారు. కాగా ఈ ఓటరు సవరణ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం(EC) ఒక స్పష్టమైన షెడ్యూల్ ఖరారు చేసింది. దీని ప్రకారం, మొదటగా ఆగస్టు 5న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేస్తారు. ఈ జాబితాలో ఏవైనా తప్పులున్నా, మార్పులు చేర్పులు అవసరమున్నా లేదా కొత్తగా అభ్యంతరాలు తెలపాలన్నా సెప్టెంబర్ 4 వరకు ప్రజలకు గడువు ఇస్తారు. ఆ తర్వాత, వచ్చిన అన్ని అభ్యంతరాలను మరియు సవరణలను అధికారులు పూర్తిగా పరిశీలించి, వీటన్నింటినీ క్రోడీకరిస్తూ అక్టోబర్ 7న తుది ఓటరు జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు.

Tags
Karnataka News Voter List DK Shivakumar Welfare Schemes Election Commission Karnataka Politics SIR 2026
Recent Comments
Leave a Comment

Related News