బన్నీ వాసు అన్నీ చెప్పాడు కానీ..

admin
Published by Admin — May 14, 2026 in Movies
News Image
తెలుగు సినీ పరిశ్రమ పెద్ద సంక్షోభం దిశగా అడుగులేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ మధ్య. సినిమాల సక్సెస్ రేట్ అంతకంతకూ పడిపోతోంది. థియేటర్లకు జనం రావట్లేదు. థియేటర్లలో ఆక్యుపెన్సీలు ఘోరంగా ఉంటున్నాయి. కొత్త సినిమాలకు మినిమం ఓపెనింగ్స్ ఉండట్లేదు. ఓవైపు థియేటర్ల నుంచి ఆదాయం తగ్గిపోతుంటే.. ఇంకోవైపు డిజిటల్ హక్కుల ధరలూ పడిపోతున్నాయి.
 
ఇలాంటి టైంలో థియేటర్ రెవెన్యూ విషయంలో ఒక పెద్ద వివాదం ముసురుకుంది. మల్టీప్లెక్సుల్లో మాదిరే సింగిల్ స్క్రీన్లలోనూ పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలంటూ తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం అల్టిమేటం విధించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్లలో ఒకరైన బన్నీ వాసు.. ఎక్స్‌లో ఒక లెంగ్తీ పోస్టు పెట్టాడు. ఆయన ఇండస్ట్రీలో ప్రస్తుతం నెలకొన్న ప్రధాన సమస్యల గురించి ప్రస్తావించాడు. 
 
రూపాయి ఆదాయం అందరికీ పోయిందని.. పెద్ద సినిమాలకు కూడా ఆదాయం రూపాయి నుంచి అర్ధరూపాయికి పడిపోయింది. ఈరోజు సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయని మనం చూస్తున్నాం కానీ ఆ కలెక్షన్లు నిజంగా ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల వచ్చినవి కాదు, టికెట్ రేట్లు, ఇతర ధరలు పెరగడం వల్ల వచ్చినవని మనందరం అర్థం చేసుకోవాలని బన్నీ వాసు అన్నాడు.
 
సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు రావడం తగ్గిపోయిందని.. వచ్చే కొద్దిమంది ప్రేక్షకుల మీదే అధిక భారం వేసి వసూళ్లు పెంచుకుని, దాన్నే భారీ కలెక్షన్లు అని చెప్పుకోవడం కన్నా పెద్ద తెలివితక్కువతనం ఇంకొకటి ఉండదని బన్నీ వాసు నిష్ఠుర సత్యం చెప్పాడు. చిన్న సినిమాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని. వారి ఆదాయం పావలా స్థాయికి పడిపోయిందని.. ఇప్పుడు ఆ పావలాలో ఎవరు ఎంత తీసుకోవాలి అని మనం కొట్టుకుంటున్నాం కానీ, అసలు మన రూపాయి ఆదాయం ఎందుకు పోయిందో మాత్రం మర్చిపోతున్నామని.. నిర్మాతలతో పాటు సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు కూడా నష్టపోతున్నారని బన్నీ వాసు స్పష్టం చేశాడు.
 
ఈ పరిస్థితి కారణాలు చెబుతూ.. హీరోలు రెండేళ్లకో సినిమా చేయడం, సినిమాలను కేవలం నాలుగు వారాలల్లోనే థియేటర్లలో రిలీజ్ చేయడం.. ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయి కంటెంట్ లేకపోవడం.. మల్టీప్లెక్సుల్లో అధిక క్యాంటీన్ ధరల గురించి ప్రస్తావించాడు బన్నీ వాసు. కంటెంట్‌ను పక్కన పెడితే మిగతా మూడు విషయాలు మన నియంత్రణలో ఉన్నవే అని.. వాటిని సరి చేయాలని బన్నీ వాసు సూచించాడు.
 
ఐతే బన్నీ వాసు అన్నీ చెప్పాడు కానీ.. తాను పర్సంటేజీ విధానానికి అనుకూలమా, రెంటల్ సిస్టమ్‌కా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు హీరోల అధిక పారితోషకాలే ఇండస్ట్రీకి అతి పెద్ద సమస్యగా మారడం గురించి మాత్రం ఆయన ప్రస్తావించలేదు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా హీరోలు తగ్గితే అన్నీ సర్దుకుంటాయని.. దీని మీద హీరోలతో మీటింగ్ పెట్టి సమస్యను పరిష్కరించడం నిర్మాతల వల్ల అవుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Tags
bunny vasu producers tollywood movie ticket prices audience
Recent Comments
Leave a Comment

Related News