తెలుగు సినిమాల టికెట్ల ధరల గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతుండడానికి, ఇండస్ట్రీ సక్సెస్ రేట్ పడిపోతుండడానికి అధిక రేట్లు ఒక ముఖ్య కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. దక్షిణాదిన మిగతా రాష్ట్రాలన్నింటికంటే తెలంగాణ, ఏపీల్లోనే టికెట్ల ధరలు అత్యధికం అన్నది వాస్తవం. విదేశాల్లో సైతం తెలుగు సినిమాలకు టికెట్ల ధరలు ఎక్కువ ఉంటాయి.
ప్రిమియర్స్‌కు ఇంకా రేట్లు పెంచి టికెట్లు అమ్ముతారు. ఇదంతా డిమాండ్ అండ సప్లై మేరకే ఉంటుందనే వాదన నిర్మాతలు, పంపిణీదారుల నుంచి వినిపిస్తుంది. ఐతే ఇది ఏ ఒక్క సినిమాకు సంబంధించిన సమస్య కాదన్నది వాస్తవం. సాధారణంగానే తెలుగు రాష్ట్రాల టికెట్ల ధరలు ఎక్కువ. పెద్ద సినిమాలకు ఇంకా పెంచుకుంటున్నారు. యుఎస్ సహా విదేశాల్లోనూ మిగతా భాషల చిత్రాలతో పోలిస్తే తెలుగు సినిమాలకు ఎక్కువ ధరలు పెడుతున్నారు.
కానీ కొత్తగా ఈ సమస్య మొదలైనట్లుగా రామ్ చరణ్ సినిమా పెద్దిని ఒక వర్గం టార్గెట్ చేస్తుండడమే విడ్డూరం. ఈ సినిమా ప్రిమియర్ షోకు టికెట్ ధర 38 డాలర్లుందని.. ట్యాక్సులతో కలిపితే 40 డాలర్లు పెట్టి సినిమా చూడాల్సి వస్తోందని.. హిందీ చిత్రాలకు 15-20 డాలర్లతో టికెట్ పెడుతుంటే ఇదేంటని ప్రశ్నిస్తూ ఒక యుఎస్ సినీ అభిమాని ఒక వీడియో పెట్టాడు. దీన్ని ఒక వర్గం వైరల్ చేసే ప్రయత్నం చేస్తోంది. కానీ వాస్తవానికి పెద్ది సినిమాకు ప్రిమియర్స్ రేటు నార్మల్ స్క్రీన్లలో 20-25 డాలర్ల మధ్యనే ఉంది. ప్రీమియం ఫార్మాట్ స్క్రీన్లలో మాత్రం 5-10 డాలర్ల అదనపు రేటు పెట్టారు.
ప్రిమియర్స్ తర్వాత పెద్ది సినిమాను 20 డాలర్లు అంతకంటే తక్కువ రేటుకే చూసే అవకాశం ఉంది. అన్ని పెద్ద సినిమాలకూ దాదాపు ఇదే రేటు ఉంటుంది. ఈవెంట్ ఫిలిమ్స్‌కు ఇంకా రేటు పెంచుతుంటారు. కానీ ఒక్క పెద్ద సినిమాకు మాత్రమే అధిక రేట్లు పెట్టినట్లు, అది కూడా వాస్తవ రేటు కంటే ఎక్కువ ధరను ప్రచారం చేస్తూ ఈ సినిమా మీద నెగెటివిటీ పెంచే ప్రయత్నం ఒక వర్గం చేస్తోంది. దీనిపై మెగా అభిమానులు మండిపడుతున్నారు.
నిజానికి చాన్నాళ్ల తర్వాత తెలుగు నుంచి ఒక క్రేజీ, పెద్ద సినిమా రిలీజవుతుండడంతో ఇటు ట్రేడ్, అటు ఆడియన్స్ ఎంతో ఉత్కంఠగా ఆ మూవీని చూసేందుకు ఎదురు చూస్తుంటే.. దానిపై అనవసర నెగెటివిటీ క్రియేట్ చేసేందుకే పనిగట్టుకుని దుష్ప్రచారాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.