సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలగాలంటే లక్ ఉండాలి.. ఆ లక్ పక్కన పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) తో ఒక్క సినిమా ఛాన్స్ వస్తే చాలు, స్టార్ హోదా ఖాయమని హీరోయిన్లు భావిస్తుంటారు. అందుకే కథ వినకపోయినా, పారితోషికం తగ్గించుకున్నా పర్వాలేదు కానీ పవన్ సరసన ఒక్కసారి స్క్రీన్ షేర్ చేసుకుంటే చాలని ఎగిరి గంతేస్తారు. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పుడు పవన్ పక్కన నటిస్తే కెరీర్ టాప్ గేర్‌లోకి వెళ్లేది.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. పవన్‌ను నమ్ముకున్న ముద్దుగుమ్మలు ఇప్పుడు కెరీర్ పరంగా నట్టేట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది.
వరుస ఫ్లాపుల్లో ఉన్న శ్రీలీల, తన బ్యాడ్ టైమ్ పోవాలంటే పవన్ కల్యాణ్ తో సినిమానే కరెక్ట్ అని భావించింది. అందుకే `ఉస్తాద్ భగత్ సింగ్`(Ustaad Bhagat Singh)పై గంపెడాశలు పెట్టుకుంది. కానీ సినిమా షూటింగ్ ఆలస్యం కావడం, మరోవైపు తన ఇతర సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడంతో శ్రీలీల గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. ఇక ఇదే సినిమాలో మరో హీరోయిన్ గా నటించిన రాశీ ఖన్నా పరిస్థితి కూడా అంతే. పవన్ సినిమా క్రేజ్‌తో తెలుగులో మళ్లీ బిజీ అయిపోవచ్చు అనుకుంది కానీ, `ఉస్తాద్` ఆమెకు ఊరటనివ్వలేదు సరే కదా.. ఉన్న అవకాశాలను కూడా దూరం చేసేలా కనిపిస్తోంది.
మరోవైపు పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్లలో ఒకటిగా నిలిచిన సినిమా `OG`. ఈ సినిమా గురించి షూటింగ్ మొదలైనప్పటి నుంచి హీరోయిన్ ప్రియాంక మోహన్ ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో మాట్లాడింది. పవన్ పక్కన కనిపిస్తే టాలీవుడ్‌లో తన దశ తిరిగిపోతుందని ఆశపడింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది, పవన్ మేనియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.. కానీ ఆ క్రెడిట్‌లో ప్రియాంకకు దక్కిన వాటా మాత్రం శూన్యం. ఈ భారీ విజయం తర్వాత కూడా ఆమెకు తెలుగులో పెద్దగా ఆఫర్లు క్యూ కట్టకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అన్నిటికంటే ఘోరమైన పరిస్థితి కన్నడ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhhi Agerwal)ది. `హరిహర వీరమల్లు` ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి ఈమె పవన్‌నే నమ్ముకుని ఉంది. ఈ ఒక్క సినిమాతో తన స్టార్ ఇమేజ్ మారిపోతుందని వేరే ప్రాజెక్టులు కూడా వదులుకుని ఏళ్ల తరబడి వెయిట్ చేసింది. పవన్ కంటే ఎక్కువగా సినిమాను ప్రమోట్ చేస్తూ నిధి పెట్టిన ఆశలు అన్నీ ఇన్నీ కావు. కానీ వీరమల్లు ఫ్లాప్ తో ఐదేళ్ల కిందట నిధి కెరీర్ ఎక్కడ ఉందో, ఇప్పుడూ అక్కడే ఉంది. చేతిలో సినిమాలు లేకపోవవడంతో నిధి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.
ఒకప్పుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత ఉండేది. కానీ కాలక్రమేణా పవన్ ఇమేజ్ భారీగా పెరగడంతో, ఆయన సినిమాలన్నీ వన్ మ్యాన్ షోలుగా మారిపోతున్నాయి. దీనివల్ల హీరోయిన్లకు కేవలం పాటలకు, కొన్ని సీన్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి వస్తోంది. పవన్‌ను నమ్ముకుని పెద్ద ప్రాజెక్టులకు సైన్ చేస్తున్న హీరోయిన్లు, చివరకు తమ కెరీర్ పరంగా ఎలాంటి పురోగతి లేక డీలా పడిపోతున్నారు. పవన్ హిట్ కొడుతున్నా.. ఆయన హీరోయిన్లు మాత్రం సక్సెస్ ట్రాక్ ఎక్కలేకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.