భారతదేశంలో కులం, మతం అనేవి కేవలం వ్యక్తిగత విషయాలు మాత్రమే కాదు.. అవి సామాజిక హోదాను, రాజ్యాంగపరమైన హక్కులను నిర్ణయించే కీలక శక్తులు. ముఖ్యంగా విద్య, ఉద్యోగాల్లో లభించే రిజర్వేషన్ల విషయంలో కులం ప్రాతిపదికన అనేక ప్రయోజనాలు అందుతున్నాయి. అయితే, ఒక మతం నుంచి మరో మతంలోకి మారినప్పుడు ఈ రిజర్వేషన్ ఫలాలు కొనసాగుతాయా? లేదా? అనే అంశంపై దశాబ్దాలుగా సాగుతున్న సందిగ్ధతకు సుప్రీంకోర్టు తాజాగా చెక్ పెట్టింది. క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్డ్ కులాల (SC) వ్యక్తులకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. హిందూ, బౌద్ధ మరియు సిక్కు మతాలకు చెందిన వారిని మాత్రమే షెడ్యూల్డ్ కులాలుగా పరిగణించే అవకాశం ఉంది. ఈ మూడు మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారిన వారు తమ పాత కుల హోదాను, దాని ద్వారా వచ్చే రిజర్వేషన్ ప్రయోజనాలను కోల్పోతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు(AP High Court) గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ అంజరియా ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వ్యక్తికి ఎస్సీ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ, అది చట్టపరంగా చెల్లుబాటు కాదని కోర్టు తేల్చి చెప్పింది.
చాలామంది మతం మారిన తర్వాత కూడా పాత కుల ధ్రువీకరణ పత్రాలను వాడుతుంటారు. దీనిపై కోర్టు ఘాటుగా స్పందించింది. `` కేవలం చేతిలో సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన రక్షణ కల్పించలేం.. చట్టం ముందు వాస్తవాలు ముఖ్యం`` అని పేర్కొంది. పాస్టర్ ఆనంద్ పాల్ కేసును ఉదాహరణగా తీసుకున్న న్యాయస్థానం.. ఆయన దశాబ్ద కాలంగా క్రైస్తవ(Christians) మత ప్రచారంలో ఉన్నారని, తిరిగి ఎస్సీ కమ్యూనిటీలో చేరలేదని గుర్తించింది. క్రైస్తవం వంటి ఇతర మతాల్లోకి వెళ్లినప్పుడు సామాజిక హోదా మారుతుందని, అప్పుడు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని స్పష్టం చేసింది.
ఈ తీర్పులో మరో కీలక అంశాన్ని కూడా సుప్రీంకోర్టు(Supreme Court) ప్రస్తావించింది. ఒకవేళ మతం మారిన వ్యక్తి తిరిగి తన పాత ఎస్సీ కమ్యూనిటీలోకి చేరినట్లయితే, ఆ విషయాన్ని ఆధారాలతో నిరూపించుకుంటే మాత్రమే పాత హోదాను తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అయితే అది కేవలం కాగితాల మీద కాకుండా, సదరు కమ్యూనిటీ అతన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా మతం మారిన తర్వాత కూడా రిజర్వేషన్లు పొందుతున్న వారికి ఇది పెద్ద షాక్ అని చెప్పవచ్చు.