నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి స్టైలే వేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎప్పుడూ సామాజిక అంశాల మీదే సినిమాలు తీస్తుంటారు. తనే కథ రాసుకుని.. మేకింగ్ సహా అన్ని విషయాలూ తనే చూసుకుని సినిమాలు చేసుకుపోతుంటారు. ఒకప్పుడు ఒరేయ్ రిక్షా, ఎర్రసైన్యం లాంటి సినిమాలు ఆయనకు పేరుతో పాటు డబ్బులూ తెచ్చిపెట్టాయి. తర్వాత కొన్ని చిత్రాలకు ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆపై ఆయన సినిమాలు ప్రభావం చూపించలేకపోయాయి.
ఇప్పటికీ తన శైలిలో సినిమాలు చేస్తూనే ఉన్నా.. వాటిని చూసే జనాలే లేరు. అయినా నారాయణమూర్తి శైలి మార్చుకోలేదు. వేరే చిత్రాల్లో నటించమని, మంచి పారితోషకాలు ఇస్తామని చెప్పినా.. ఆయన దశాబ్దాలుగా ఆ పని చేయట్లేదు. ‘టెంపర్’ సినిమాలో పోసాని కృష్ణమురళి చేసిన మూర్తి పాత్రకు మూర్తినే అడిగాడు పూరి జగన్నాథ్. కానీ ఆయన ఒప్పుకోలేదు. దీంతో ఆ పాత్రకు మూర్తి అని పేరు పెట్టుకుని సంతృప్తి చెందారు పూరి.
దీంతో పాటు ఎన్ని అవకాశాలు వచ్చినా ఒప్పుకోని నారాయణమూర్తి.. ఇప్పుడు తొలిసారిగా బయటి చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ‘హుషారు’ చిత్రాన్ని రూపొందించిన శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో నారాయణమూర్తి నటించనున్నాడట. ఆ చిత్రం.. హుషారు సీక్వెల్ అని సమాచారం. పూరి లాంటి దర్శకుడు ఎంత అడిగినా సరే, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోతో నటించడానికి కూడా అంగీకరించని మూర్తి.. శ్రీ హర్ష లాంటి యువ దర్శకుడు రూపొందించబోతున్న, ‘హుషారు’ లాంటి యూత్‌ఫుల్ మూవీ సీక్వెల్‌లో నటించడానికి రెడీ అవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఐతే ఇందులో ఆయనకు తగ్గ పాత్రే ఉందని సమాచారం. అది నక్సలైట్ పాత్ర అంటున్నారు. కాబట్టే నారాయణమూర్తి ఒప్పుకున్నారట. ఆయన వామపక్ష భావజాలం గురించి తెలిసిందే. తన సినిమాలన్నీ కూడా ఆ భావజాలంతోనే నడుస్తాయి. అందుకే ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారట. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన చేయబోతున్నారు. ఈ సినిమాకు నారాయణమూర్తే ప్రధాన ఆకర్షణగా మారుతారనడంలో సందేహం లేదు. దీని మీదే టీం ప్రమోషన్లు కూడా గట్టిగా చేసుకోవచ్చు