పెద్ద సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు పెంచడం, బెనిఫిట్ షోలు వేయడం కామన్ అయిపోయింది ఈ మధ్య. కానీ తెలంగాణలో అనుకోని పరిస్థితుల వల్ల అప్పుడప్పుడూ ఇబ్బందులు తప్పడం లేదు. సంక్రాంతి టైంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి రేట్లు పెంచడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల వల్ల బ్రేక్ పడ్డప్పటికీ.. ఇటీవల సుప్రీం కోర్టు ఆ తీర్పును కొట్టివేయడంతో మళ్లీ రేట్లు పెంచుకోవడానికి మార్గం సుగమమైంది.
ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు వరకు వెళ్లి సానుకూల ఫలితం రాబట్టి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. తమ ప్రొడక్షన్ నుంచి వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (ustaad bhagat singh)చిత్రానికి అదనపు రేట్లు, షోల కోసం జీవో తెచ్చుకుంటుందనే అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ సినిమాకు తెలంగాణలో బెనిఫిట్ షోలు పడట్లేదు. రేపు ఉదయం 7 నుంచి షోలు మొదలవుతున్నాయి. అన్ని షోలకూ సాధారణ రేట్లే(ticket rates) వర్తించబోతున్నాయి. కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చినా సరే రేట్లు పెంచకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
దీనికి కారణమేంటో మైత్రీ మూవీస్ అధినేతల్లో ఒకరైన నవీన్ యెర్నేని వెల్లడించారు. ‘‘సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఇక్కడ రేట్లు పెంచుకోవడానికి మాకు పెద్దగా టైం లేకపోయింది. సీఎం గారిని కలిసే అవకాశం రాలేదు. అదే సమయంలో నార్మల్ రేట్లతో సినిమాను రిలీజ్ చేస్తే స్పందన ఎలా ఉంటుందో చూద్దామని కూడా అనుకున్నాం. ఇంతకుముందు ఇలా చేసినపుడు మంచి ఫలితాలు వచ్చాయి. దీని వల్ల కచ్చితంగా ఫుట్‌ఫాల్స్ పెరుగుతాయని అనుకుంటున్నాం’’ అని నవీన్ తెలిపారు. ‘దురంధర్-2’ తెలుగు ప్రిమియర్స్ క్యాన్సిలైన నేపథ్యంలో ‘ఉస్తాద్’కు ప్రిమియర్స్ వేస్తే మంచి ఫలితం ఉండేదా అని అడిగితే.. అదేమీ లేదన్నారు నవీన్.
‘దురంధర్-2’ను చాలా వరకు హిందీలోనే చూడాలనుకుంటారని.. కాబట్టి తెలుగు ప్రిమియర్స్ రద్దవడం వల్ల ఆ ప్రభావం ఏమీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పండుగ రోజే రిలీజవుతోంది కాబట్టి.. అర్లీ మార్నింగ్ షోలు పడితే సరిపోతుందని.. పండుగ లేనపుడే ముందు రోజు ప్రిమియర్స్ వేయాల్సిన అవసరం ఉంటుందని ఆయనన్నారు. ఇక ‘ఉస్తాద్’కు పవన్ కళ్యాణ్ తీసుకున్న పారితోషకం గురించి స్పందిస్తూ.. ఆయన నామమాత్రంగా అడ్వాన్స్ మాత్రమే తీసుకున్నారని, సినిమా చాలా ఆలస్యం అయింది కాబట్టి ముందు ప్రొడక్షన్ చూసుకోమన్నారని, తర్వాత అంతా బాగుంటే ఏమైనా చూద్దాం అని షూటింగ్ మొదలవడానికి ముందు చెప్పడం తమకు పెద్ద షాక్ అని.. అంతగా ఆయన తమకు సహకారం అందించారని నవీన్ తెలిపారు.