ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో పల్లె రాజకీయాల దుమ్ము లేచింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తొలి విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతోనే, గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కసారిగా ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఎటు చూసినా సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల సందడే కనిపిస్తోంది. అయితే, ఈసారి పంచాయతీ పోరు ప్రతిపక్ష వైయస్సార్సీపీకి మాత్రం ఎటూ తేల్చుకోలేని ఒక క్లిష్టమైన రాజకీయ అగ్నిపరీక్షగా మారింది.
రాష్ట్రంలో గ్రామాలను ఏకగ్రీకం చేసుకునే పార్టీలు, వర్గాలకు ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులు పల్లె రాజకీయాలను మరింత వేడెక్కించాయి. 5,000 లోపు జనాభా ఉన్న పంచాయతీకి ఏకగ్రీవమైతే రూ.15 లక్షలు, 10,000 లోపు జనాభా ఉన్న వాటికి రూ.25 లక్షలు, ఆపైన జనాభా ఉన్న పెద్ద పంచాయతీలకు ఏకంగా రూ.50 లక్షల నగదు బహుమతిని ప్రభుత్వం అందిస్తోంది. గతంలో ఈ ప్రోత్సాహకాలు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఈ మొత్తాన్ని భారీగా పెంచడంతో, గ్రామాల్లో ఎలాగైనా ఏకగ్రీవాలు సాధించాలనే పట్టుదల అధికార వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
మరోవైపు, ఈ భారీ నజరానాల ఎఫెక్ట్‌తో పాటు స్థానిక పట్టు కోసం పల్లెల్లో ‘సర్పంచ్’ పదవుల వేలంపాటలు జోరందుకున్నాయి. లక్షలు, కోట్లు వెచ్చించి మరీ పదవులు దక్కించుకునేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) గతంలో తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. గతంలో ఏకగ్రీవాలు జరిగిన నియోజకవర్గాల ఇన్ఛార్జ్లకు భవిష్యత్తులో ఎన్నికల టికెట్లు ఇవ్వబోనని జగన్ స్పష్టంగా హెచ్చరించారు. అయితే, మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆయన సొంత కంచుకోట పులివెందులతో సహా కడప జిల్లాలోనే ఏకగ్రీవాలు జరగడం అప్పట్లో పెద్ద చర్చ అయింది. ఇప్పుడు గ్రామ పంచాయతీల్లోనూ అదే పరిస్థితి ఎదురుకానుంది.
అయితే ఈ వేలంపాటల్లో లేదా ఏకగ్రీవాల్లో వైసీపీ(YCP) అనుకూల అభ్యర్థులు కనుక చురుగ్గా పాల్గొంటే.. పార్టీ అధినేత గతంలో చెప్పిన మాటలకు, ప్రస్తుతం జరుగుతున్న తంతుకు పొంతన లేదని టీడీపీ సహా ప్రత్యర్థులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తారు. ఇది పార్టీ ద్వంద్వ ప్రమాణాలను ఎత్తిచూపేలా మారుతుంది.ఒకవేళ వేలంపాటలు, ఏకగ్రీవాల జోలికి వెళ్లకుండా సైలెంట్‌గా ఉంటే.. గ్రామస్థాయిలో పార్టీకి ఉన్న పట్టు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది.పోని కోట్లు ఖర్చు పెట్టి స్వయంగా సర్పంచ్ పదవులు దక్కించుకున్నా.. అభివృద్ధి పనుల నిమిత్తం స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల సహాయ సహకారాలు లేకపోతే ఆ పదవిలో ఉండి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది. మొత్తంగా చూస్తే, ఏపీ పంచాయతీ పోరు వైయస్సార్సీపీకి అడుగు ముందుకు వేస్తే ప్రమాదమే, వెనక్కి తగ్గితే నష్టమే అన్నట్లుగా తయారైంది. మరి ఈ రాజకీయ వ్యూహాలను జగన్ అండ్ కో ఎలా ఎదుర్కొంటారనేది వేచి చూడాలి.