రాజకీయాల్లో కొన్ని సెంటిమెంట్లు అలా గట్టిగా అతుక్కుపోతాయి. ఎంత కడిగినా పోవు, ఎటు తిప్పినా అవే ఫలితాలు రిపీట్ అవుతుంటాయి. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) పరిస్థితి చూస్తుంటే అచ్చం అలాగే ఉంది. ఏపీ రాజకీయాల్లో '11' అనే అంకె ఆ పార్టీకి ఓ శాపలా మారిపోయిందా? లేక అదేదో లక్కీ నంబర్ అనుకుని ఆ పార్టీ లీడర్లు మురిసిపోతున్నారా? అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనం 11 సీట్లతో సరిపెడితే, తాజాగా వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ సరిగ్గా అదే '11' పర్సెంట్ సీట్లతో సరిపెట్టుకోవాల్సి రావడం విశాఖ పాలిటిక్స్ లో ఇప్పుడు నవ్వుల పాలవుతోంది.
విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని, వైజాగ్ నుంచే అంతా నడిపిస్తామని గతంలో జగన్(Jagan) అండ్ కో ఎంత పెద్ద మాటలతో కోటలు కట్టారో అందరికీ గుర్తుండే ఉంటుంది. "సేవ్ విశాఖ" అంటూ ఏకంగా మేయర్ అభ్యర్థిని ముందుగానే ప్రకటించి, బీసీ, వెలమ కార్డులన్నీ వాడి చూశారు. నీటి కష్టాలు, భూ పందేరాలు, విశాఖను అమ్మేస్తున్నారంటూ కూటమిపై విమర్శల వర్షం కురిపించారు. కానీ, సాగర తీరంలోని ఓటర్లు మాత్రం వైసీపీ నాయకుల మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. హడావుడి చేసి ప్రచారంలోకి దూసుకెళ్లిన ఫ్యాన్ పార్టీకి, పోలింగ్ బూట్ల వద్ద మాత్రం చల్లటి గాలి తగిలి చతికలపడేలా చేశారు.
ఇక హిస్టరీ చూస్తే వైజాగ్(Vizag) లవ్-హేట్ స్టోరీ ఎప్పుడూ రంజుగానే ఉంటుంది. 2014లో పార్టీ తొలిసారి అరంగేట్రం చేసినప్పుడు స్వయంగా విజయమ్మే బరిలోకి దిగినా.. లక్ష ఓట్ల తేడాతో ఓటమి తప్పలేదు. ఆ తర్వాత 2019లో రాష్ట్రమంతా తుఫానులాంటి విజయం దక్కినా, విశాఖ పార్లమెంట్ పరిధిలోని నాలుగు అసెంబ్లీ సీట్లను టీడీపీ ఖాతాలోనే వేసింది వైజాగ్ జనం. ఇక 2024 ఎన్నికల్లో అయితే అసలు మ్యాటర్ అక్కడే తేలిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా కూటమి సునామీలో వైసీపీ ఏకంగా 11 సీట్లకు పరిమితం కాగా, తాజాగా స్థానిక పోరులోనూ మళ్లీ అదే '11' శాతం సీట్లు (120 వార్డుల్లో కేవలం 13 సీట్లు) దక్కడం చూస్తుంటే.. "నంబర్ సెంటిమెంట్ అంటే ఇదేమో" అని ప్రత్యర్థులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.
ఎన్ని వ్యూహాలు మార్చినా, ఎంతమందిని రంగంలోకి దించినా విశాఖ మాత్రం వైసీపీకి ఎప్పటికీ అంతుచిక్కని తీరంగానే మిగిలిపోతోంది. అటు రాజధాని అన్నా, ఇటు అభివృద్ధి మంత్రం జపించినా.. వైజాగ్ పబ్లిక్ మాత్రం ఫ్యాన్ పార్టీకి ఓటు రూపంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. మొత్తానికి '11' అంకెతో విడదీయరాని బంధం తెచ్చుకున్న వైసీపీ(YCP)కి, వైజాగ్ సాగర తీరం మాత్రం ఇప్పట్లో దక్కేలా లేదనే చెప్పాలి.