``పార్టీ కార్యాలయానికి ఎవరూ రావొద్దు. ఏదైనా ఉంటే మేమే సమాచారం ఇస్తాం``- ఇదీ గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం ముందు మంగళవారం మధ్యాహ్నం తగిలించిన బోర్డు సారాంశం. ``ప్రస్తుతం జగన్ గారు అందుబాటులో లేరు. ఇతర నేతలు కూడా వ్యక్తిగత పనులపై వేరే ప్రాంతాలకు వెళ్లారు. ఎవరూ కార్యాలయానికి రావొద్దు`` అని బోర్డులో పేర్కొన్నారు. ఇక, రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. నామినేషన్లు వేయనీయడం లేదంటూ.. యాగీ చేసిన వైసీపీ.. వేసిన చోట కూడా చతికిల పడింది. తమకు గట్టి పట్టున్న పులివెందులలోనూ.. పార్టీ ఘోర పరాజయం చవిచూసింది.
ఇక, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు జిల్లాలు వైసీపీ నుంచి దూరమయ్యాయి. కీలక నాయకులు, మాజీ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లోనూ వైసీపీ పత్తా లేకుండా పోయింది. గట్టిపోటీ ఇచ్చామన్నసంతృప్తి ఉన్నా.. ఒక్కరు కూడా గెలవని జిల్లాలు ఉండడంతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దీనికి తోడు.. తాడేపల్లి, తెనాలి, గుంటూరు, తూర్పు, విశాఖపట్నం, పల్నాడు జిల్లాల్లోనూ కూటమి ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. దీంతో వైసీపీ ముఖ్య నాయకులు ఎవరూ మీడియా ముందుకు వచ్చేందుకు సాహసించలేదు. మరోవైపు కూటమి పార్టీల నాయకులు సంబరాలు చేసుకంంటున్నారు.
కార్యాలయంలోనే ఉన్నా..
తాడేపల్లి వైసీపీ ఆఫీసు ముందు బోర్డు పెట్టినా.. లోపల నాయకులు ఉన్నారని మీడియా మిత్రులు వ్యాఖ్యానించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది మాత్రం..తమకు ఈ సమాచారమే ఉందని చెప్పారు. లోపల లైట్లు వెలుగు తుండడం.. పలువురు అటు ఇటు తిరుగుతుండడం వంటివి బయటకు వచ్చాయి. అయినప్పటికీ.. మీడియాతో మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పైగా సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎవరినీ అక్కడ నిలవకుండా పంపించేశారు. మరీ ముఖ్యంగా గుంటూరు, తెనాలి సహా.. సమీప ప్రాంతాల నుంచి వైసీపీ నాయకులు కూడా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు., అయితే.. వారిని కూడా లోపలికి అనుమతించలేదు. దీంతో వర్షంలోనూ వారంతా వెనుదిరిగారు.
ఎందుకు?
వైసీపీ గత 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితం అయింది. ఇప్పుడు మునిసిపల్ సహా కార్పొరేషన్ స్థానాల్లో అంతకుమించిన ఘోర పరాభవం చవిచూసిందన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ నాయకులు ఎవరూ ఈవిషయంపై స్పందించేందుకు ముందుకు రాలేదని తెలిసింది. ఓటింగ్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపించేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని అంటున్నారు. ఎందుకంటే తాజా ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరిగాయి. మరోవైపు కౌంటింగ్ సరళి కూడా.. ఎక్కడా వివాదాలకు తావులేకుండాచేపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ నేతలు.. తాడేపల్లికార్యాలయానికి ఎవరూ రాకుండా.. బోర్డు పెట్టారన్న చర్చ సాగుతోంది.