ఆర్నబ్ తుఫాను పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే.. దీనిపై ముందు నుంచి తాము అప్రమ త్తంగానే ఉన్నామని తెలిపారు. దాదాపు 8 రోజుల నుంచే తుఫాను సన్నద్ధతపై దృష్టి పెట్టామని, దీంతోపాటు సాంకేతికతను విరివిగా వినియోగించుకున్నామని అన్నారు. ఫలితంగా భారీ ప్రాణ నష్టాన్ని తప్పించామని చెప్పారు. అయినప్పటికీ.. ఐదుగురు మృతి చెందారని, ఇది చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామన్నారు.
రాష్ట్రంలోని పలు జిల్లాలను అతలాకుతలం చేసిన ఆర్నాబ్ తుఫాను పరిస్థితులపై చంద్రబాబు బుధవారం సాయంత్రం అత్యవసర ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఆయన తుఫాను నష్టం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కీలక వివరాలను వెల్లడించారు.
తుఫాను నష్టం - ప్రాణనష్టంపై మాట్లాడుతూ.. ఆర్నాబ్ తుఫాను తీవ్ర ప్రభావం వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదుగురు మరణించారని సీఎం విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. తద్వారా భారీ ప్రాణ నష్టం తప్పిందని చెప్పారు.
టెక్నాలజీని వినియోగించుకున్న కారణంగా.. తుఫాను గమనాన్ని ముందుగానే గుర్తించి ఆయా ప్రాంతాల్లో చర్యలు చేపట్టినట్టు వివరిం చారు. రవాణా సదుపాయాలు, బాధితులను ఆదుకునేందుకు హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పునరావాస కేంద్రాల్లోని వారికి నిరంతరం ఆహారం, తాగునీరు అందించే ఏర్పాట్లు చేశామన్నారు. గత మూడు రోజులుగా అధికారులతో నిరంతరం తుఫాను ముప్పుపై సమీక్షలు నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. తుఫాను కారణంగా పంటలు, ఆస్తులు నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో ఆదుకుంటామని చెప్పారు. బాధితులకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఒక్కొక్క కుటుంబానికీ..
తుఫాను బాధిత ప్రాంతాల్లోని వారిని ఆదుకునేందుకు నిత్యావసరాలను సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఒక్కొక్క కుటుంబానికీ 25 కిలోల బియ్యం, దుంపలు, ఉల్లిపాయలు, నూనె వంటి నిత్యావసరాలను అందిస్తామన్నారు. అలాగే.. మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల చొప్పున బియ్యం సహా ఇతర సరుకులు అందిస్తామన్నారు. కేంద్రానికి ఈ వ్యవహారంపై లేఖ రాశామని ఆదుకోవాలని కోరామని చంద్రబాబు వివరించారు. కేంద్రం ఇచ్చే నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మేరకు జోడించి బాధితులకు ఆర్థిక సాయం చేయనున్నట్టు వివరించారు. ఈ విపత్తును కూడా వైసీపీ రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోందని.. దీనిని ఎవరూ నమ్మొద్దని ఆయన పిలుపునిచ్చారు.