రాజకీయాల్లో శాశ్వత శత్రువులు గానీ, శాశ్వత మిత్రులు గానీ ఉండరని పెద్దలు ఊరికే అనలేదు. ఇక్కడ ఎవరికి ఏది ప్రయోజనం అనిపిస్తే, అడుగులు అటే పడతాయి. గెలుపు రుచి చూడటం ఎంత ముఖ్యమో, ప్రత్యర్థిని దెబ్బకొట్టడం అంతకంటే పవర్ ఫుల్ వ్యూహంగా మారుతుంది. సరిగ్గా ఇదే సూత్రం ఇప్పుడు బెజవాడ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. విజయవాడ మేయర్ పీఠం దక్కకపోయినా పర్వాలేదు, కూటమికి మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేయాలనే కసితో వైసీపీ(YCP) సరికొత్త గేమ్ ప్లాన్ అమలు చేస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది.
విజయవాడ మేయర్(Vijayawada Mayor) సీటు కోసం కూటమి తరఫున జనసేన నుంచి వంగవీటి రాధా బరిలోకి దిగడంతోనే ఈ ఎన్నికలపై అందరి దృష్టి నిలిచింది. ఒకవైపు కూటమి బలం, మరోవైపు 'వంగవీటి' బ్రాండ్ ఇమేజ్ తోడవ్వడంతో రాధ దూకుడు స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో వైసీపీ అనూహ్యంగా రాయన భాగ్యలక్ష్మిని మేయర్ అభ్యరిధిగా ప్రకటించింది. మరోవైపు స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు బరిలో నిలిచారు. దీంతో క్షేత్రస్థాయిలో లెక్కలు పూర్తిగా మారిపోయాయి. రాధను ఎదుర్కొని గెలవడం అంత తేలిక కాదని గ్రహించిన స్థానిక వైసీపీ శ్రేణులు, తమ అభ్యర్థి గెలుపు కన్నా కూటమి అభ్యర్థి ఓటమే టార్గెట్‌గా పావులు కదుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అందులో భాగంగానే కమ్యూనిస్ట్ పార్టీల మద్దతుతో స్వతంత్ర అభ్యరిధిగా బరిలో దిగిన ఏబీ వెంకటేశ్వరరావు(A.B. Venkateswara Rao) వైపు వైసీపీ నేతల చూపు మళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. బెజవాడ రాజకీయాల్లో కమ్మ సామాజికవర్గ ప్రాధాన్యం చాలా కీలకం. కాపు సామాజికవర్గానికి చెందిన వంగవీటి రాధను దెబ్బకొట్టాలంటే, అదే సామాజికవర్గ సమీకరణాలను చీల్చగల ఏబీవీ లాంటి బలమైన నేత అయితేనే కరెక్ట్ అని వైసీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారట. ఏబీవీ తన సామాజికవర్గ ఓట్లను ఆకర్షిస్తే, అది కూటమి ఓటు బ్యాంకులో భారీ చీలిక తెస్తుందని, దానివల్ల తమకు మేలు జరగకపోయినా కూటమికి మాత్రం గట్టి దెబ్బ తగులుతుందని వైసీపీ లెక్కలు వేస్తోంది.
నిజానికి గడచిన ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు ఏబీవీపై అదే వైసీపీ ప్రభుత్వం రాజకీయంగా తీవ్ర పోరాటమే సాగించింది. అలాంటిది ఇప్పుడు అదే ఏబీవీ ఎన్నికల ప్రచారాన్ని, ఆయన స్పీచ్‌లను వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేస్తుండటం విశేషం. నిన్నటి వరకు రాజకీయ ప్రత్యర్థిగా చూసిన వ్యక్తి కోసం నేడు గుట్టుగా తెరవెనుక క్యాంపెయిన్ చేయడం బెజవాడ రాజకీయాలకే హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి రాధ(Vangaveeti Radha) గెలుపును అడ్డుకోవడానికి గత శత్రువుతోనే లోపాయికారి ఒప్పందానికి సిద్ధపడ్డారనే గుసగుసలు ఇప్పుడు విజయవాడ పొలిటికల్ సర్కిల్స్‌ను షేక్ చేస్తున్నాయి. మరి ఈ పరిణామాల నేపథ్యంలో మేయర్ పీఠం ఎవలను వరిస్తుందో పక్కన పెడితే.. బెజవాడ రాజకీయం మాత్రం రంజులైన మలుపులతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.