జ‌డ్పీల్లో కాయ్ రాజా కాయ్‌.. ఏం జ‌రుగుతోందంటే.. !

admin
Published by Admin — October 29, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ (AP ZP Elections 2026) పీఠాల ఎన్నికల వ్య‌వ‌హారంలో పందేలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలు, మండ‌ల‌స్థాయి రాజకీయాల్లో ఇప్పుడు "కాయ్ రాజా కాయ్" (పందేల జోరు) తరహా వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని 28 జిల్లాల జడ్పీ చైర్‌పర్సన్ స్థానాలకు రిజర్వేషన్లు అధికారికంగా ఖరారు కావడంతో, స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటాలని ఆయా రాజకీయ పార్టీల నేతలు ముమ్మరంగా వ్యూహాలు ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. అదే స‌మ‌యంలో మా వోళ్లు గెలుస్తారని కొంద‌రు.. కాదు మావోళ్లు గెలుస్తార‌ని మ‌రికొంద‌రు ఇలా.. పందేల‌పై పందేలు క‌డుతున్నారు.

గతంలో రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్‌లు మాత్రమే ఉండేవి. ఈ జిల్లాల పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో, ప్రభుత్వం పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా ఉమ్మడి జడ్పీ(ZP)లను విభజించి, మొత్తం 28 జడ్పీలను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల పరిధిలోని మండలాలు ఈ నూతన జడ్పీల కిందకు వచ్చాయి.  పంచాయతీరాజ్ గ్రామీణాభి వృద్ధి శాఖ కమిషనర్ ఈ 28 జడ్పీ స్థానాలకు రిజర్వేషన్లను అధికారికంగా ప్రకటించారు. తాజాగా కూట‌మి పార్టీల త‌ర‌ఫున అభ్య‌ర్థుల‌ను ఇంకా ఖ‌రారు చేయ‌లేదు.

అయిన‌ప్ప‌టికీ ఇప్పుడు రాజకీయ బెట్టింగులు మొదలయ్యాయి. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి(West Godavari) స‌హా క‌ర్నూలు వంటి జిల్లాల్లో.. ఏ పార్టీ గెలుస్తుందో అన్న అంశం రోజురోజుకూ చర్చగా మారుతోంది. నలుగురు కలిసిన చోటల్లా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. చర్చ వరకే ఆగకుండా రాజకీయ పార్టీల నాయకులు బెట్టింగ్‌లు కాస్తున్నారు. మా పార్టీ గెలుస్తుందని అంటే.. లేదు మా పార్టీనే గెలుస్తుందని బెట్టింగ్‌లు పెడుతున్నారు. ప్ర‌ధానంగా ఈ పోటీ టీడీపీ-వైసీపీ మధ్య ఎక్కువ‌గా ఉంద‌నే చెప్పాలి.

టీడీపీ(TDP) గెలిచి తీరుతుంద‌ని కొంద‌రు చెబుతుంటే.. కాద‌ని.. వైసీపీని స‌మ‌ర్థించే వారు చెబుతున్నారు. జ‌న‌సేన నాయ‌కులు కూడా ఈ రొచ్చులోకి దిగారు. ఈ నాయకులు సైతం మేమే గెలుస్తాం అంటున్నారు. ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు గంపగుత్తగా వైసీపీకే పడ‌తాయని  ఆ పార్టీని స‌మ‌ర్ధించే వారు పేర్కొంటున్నారు. ఈ తరుణంలో నాయకులు రూ.50వేల నుంచి లక్షల్లో బెట్టింగ్‌ పెడుతున్నారు. ముఖ్యంగా చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ రేసుల్లో ఉన్న వారిపై ఎక్కువ‌గా దృష్టి పెడుతుండ‌డం గ‌మ‌నార్హం. దీనిలో కూడా సామాజిక వ‌ర్గాల ఆధారంగా అంచ‌నాలు వేస్తున్నారు. అయితే.. ఎన్నిక‌ల సంఘం ఈ విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ప్ర‌జాస్వామ్య వాదులు కోరుతున్నారు. ఇలా బెట్టింగుల‌కు పాల్ప‌డితే.. ఇబ్బందులు వ‌స్తాయ‌ని.. టీడీపీ నేత‌లు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

Tags
AP ZP Elections 2026 AndhraPradesh AP Politics ZPTC TDP YSRCP JanaSena AP Local Elections Bettings
Recent Comments
Leave a Comment

Related News