ఏపీలో ఇక ప్ర‌చార ప‌ర్వం

admin
Published by Admin — October 19, 2026 in Andhra
News Image

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నామినేష‌న్ ప్ర‌క్రియ ఆదివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ముగిసింది. నామినేష‌న్ల ప‌రిశీల‌న ప్ర‌క్రియ కూడా ప్రారంభ‌మైంది. అయితే.. పోటీ ఎక్కువ‌గా ఉన్న సుమారు 60 మునిసిపాలిటీలు, 8 కార్పొరేష‌న్ల ప‌రిధిలో ప్ర‌చార ప‌ర్వం కూడా సోమ‌వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో పోలీసులు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను క‌ల్పించే దిశ‌గా అడుగులు వేశారు. నామినేష‌న్ల దాఖ‌లు స‌మ‌యంలో ప‌లు జిల్లాల్లో ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నాయి. ముఖ్యంగా సీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున అల్ల‌ర్లు చెల‌రేగాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌చారా ల స‌మ‌యంలో పెద్ద ఎత్తున ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

గడప గడపకూ ప్రచారం:

అభ్యర్థులు, వారి మద్దతుదారులు నేరుగా ఓటర్ల ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తారు. స్థానిక సమస్యలు, అభివృద్ధి హామీలపై దృష్టి పెడతారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు సూచ‌న‌ల‌మేర‌కు ఇప్ప‌టికే ఇంటింటికీ తిరిగిన నాయ‌కులు.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డం తోపాటు స్థానికంగా ఉన్న అభివృద్ధి ప్రాజెక్టుల‌పైనా ప్ర‌చారం చేయ‌నున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో జ‌న‌సేన‌, బీజేపీ, టీడీపీల కూట‌మి ప్ర‌భావం ఏమేర‌కు ఉంటుంద‌న్న‌ది ప్ర‌చారంలోనే చూడాలి. అదేస‌మ‌యంలో నియమావళికి లోబడి చిన్న తరహా సమావేశాలు, బైక్ ర్యాలీలు, మైకుల ద్వారా ప్రచారం నిర్వహించే అవ‌కాశం ఉంది.

వైసీపీ కూడా..

కొన్ని ప్రాంతాల్లో నామినేష‌న్ వేయ‌క‌పోయినా.. చాలా ప్రాంతాల్లో వైసీపీ అభ్య‌ర్థులు నామినేష‌న్ వేసిన నేప‌థ్యంలో వైసీపీ నేత‌లు కూడా ప్ర‌చార ప‌ర్వంలో దూకుడు ప్ర‌ద‌ర్శించేలా వ్యూహాలు రచించారు. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునేందుకు అభ్య‌ర్థులు రెడీ అయ్యారు. అయితే.. బ‌హిరంగ స‌భ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు. ఇదేస‌మ‌యంలో కూట‌మిలో ఏర్ప‌డిన కొన్ని కొన్ని స‌మ‌స్య‌లు.. పెరిగిన రెబ‌ల్స్ కార‌ణంగా వైసీపీ ల‌బ్ధి పొందే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో టీడీపీ, జ‌న‌సేనల మ‌ధ్య స‌ఖ్య‌త త‌గ్గుముఖం ప‌ట్టి రెబ‌ల్స్ బ‌రిలో నిలిచారు. ఇది తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది. అంతిమంగా వైసీపీకి మేలు చేసే అవ‌కాశం ఉంద‌ని లెక్క‌లు వేస్తున్నారు.

టెన్ష‌న్ త‌ప్ప‌దు..

ప్ర‌చార ప‌ర్వం ముగిసే వ‌ర‌కు కూడా ఏపీలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు. ఈ ఎన్నిక‌ల‌ను టీడీపీ కూట‌మి, వైసీపీ కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డంతో ప్ర‌చార ప‌ర్వం వాడి వేడిగానే సాగే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్లు కూడా పెర‌గ‌నున్నాయి. ఇది ఉద్రిక్త‌త‌ల‌కు దారితీయొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక‌, ఈ నెల 26వ తేదీ వ‌ర‌కు ప్ర‌చారం చేసుకునేందుకు అవ‌కాశం ఉంది. 28న పోలింగ్ నిర్వ‌హిస్తారు. 30న ఫ‌లితాన్ని ప్ర‌క‌టించ‌నున్నారు. 

Tags
Municipal elections campaign started ap local body elections
Recent Comments
Leave a Comment

Related News