``అప్ప‌టి వ‌రకు.. పెద్దిరెడ్డి ఫ్యామిలీని జైల్లో పెట్టాలి``

admin
Published by Admin — October 18, 2026 in Andhra
News Image

వైసీపీ నాయ‌కుడు, పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స‌హా.. ఆయ‌న కుమారుడు, రాజంపేట‌ ఎంపీ మిథున్‌రెడ్డి స‌హా వారి కుటుంబ స‌భ్యుల‌ను జైల్లో పెట్టాల‌న్న డిమాండ్ తెర‌మీదికి వ‌చ్చింది. రాష్ట్రంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వారు బ‌య‌ట స్వేచ్ఛ‌గా ఉంటే.. ఎన్నిక‌లు స‌జావుగా సాగే అవ‌కాశం లేద‌ని బీసీవై నాయ‌కుడు రామ‌చంద్ర యాద‌వ్ ఆరోపించారు. తాజాగా శుక్ర‌వారం జ‌రిగిన పుంగ‌నూరు ఘ‌ర్ష‌ణ‌ల‌కు వీరే బాధ్యుల‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఎన్నిక‌ల‌ను ప్ర‌శాంతంగా జ‌ర‌గ‌కుండా చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగార‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల్లో కుట్ర‌లు పన్నార‌ని పేర్కొన్నారు.

ఈ నేప‌థ్యంలో పెద్దిరెడ్డి కుటుంబాన్ని స్థానిక ఎన్నిక‌లు ముగిసేవ‌ర‌కు.. అంటే.. డిసెంబ‌రు 10వ తేదీ వ‌ర‌కు జైల్లోనే పెట్టాల‌ని రామ‌చంద్ర యాద‌వ్ డిమాండ్ చేశారు. ఈ వ్య‌వ‌హారంపై తాము ఎన్నిక‌ల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామ‌ని.. వారిని జైల్లో పెట్టే వ‌ర‌కు విశ్ర‌మించ బోమ‌ని అన్నారు. శుక్ర‌వారం జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల వెనుక ఎంపీ మిథున్‌రెడ్డి ప‌క్కా ప్లాన్ ఉంద‌ని యాద‌వ్ ఆరోపించారు. శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌లు సృష్టించి.. ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా చేయాల‌న్న కుట్ర దాగి ఉంద‌న్నారు. దీనిపై పూర్తి విచార‌ణ చేయాల‌ని.. బాధ్యులైన పెద్దిరెడ్డి కుటుంబాన్ని జైలుకు పంపించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇది చిన్న విష‌యం కాద‌ని అన్నారు.

తాజాగా జ‌రిగిన విధ్వంసం, ఘ‌ర్ష‌ణ‌, రాళ్ల‌దాడి, వాహ‌నాలను త‌గ‌ల‌బెట్ట‌డం వంటి ఘ‌ట‌న‌ల‌కు తానే ప్ర‌త్య‌క్ష సాక్షిన‌ని యాద‌వ్ పేర్కొన్నారు. దీనిపై ఎక్క‌డికి ర‌మ్మ‌న్నా వ‌చ్చి సాక్ష్యం చెబుతాన‌న్నారు. ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కు పెద్దిరెడ్డి కుటుంబాన్నిజైల్లో పెట్ట‌క‌పోతే.. పుంగ‌నూరు లో ప్ర‌శాంత‌త ఉండ‌ద‌ని పేర్కొన్నారు. గ‌త 2021లో జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ఇలానే వ్య‌వ‌హ‌రించార‌ని ప్ర‌త్య‌ర్థుల‌ను ఇంటి నుంచి బ‌య‌ట‌కు కూడా రాకుండా అడ్డుకున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉండి కూడారెచ్చిపోతున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇలాంటి వారికి ప్ర‌జ‌ల్లో ఉండే అర్హ‌త లేద‌ని అన్నారు. త‌క్ష‌ణ‌మే దీనిపై పోలీసులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. లేకుంటే తాను కోర్టును ఆశ్ర‌యిస్తాన‌ని తెలిపారు.

ఎవ‌రీ రామ‌చంద్ర‌?

బోడే రామ‌చంద్ర‌యాద‌వ్‌.. భార‌త చైత‌న్య యువ‌జ‌న పార్టీ వ్య‌వ‌స్థాపకుడు. గ‌త ఎన్నిక‌ల్లో పుంగ‌నూరు నుంచి పోటీ చేసి ప‌రాజ‌యం పాల య్యారు. బీజేపీకి అనుబంధంగా ప‌నిచేస్తార‌న్న పేరుంది. త‌న పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా విస్త‌రించే ప‌నిలో ఉన్నారు. బీసీల‌కు రాజ్యాధికారం ద‌క్కాల‌ని కాంక్షిస్తున్న బోడే.. యువ‌త సెంట్రిక్‌గా రాజ‌కీయాలు చేస్తున్నారు. పుంగ‌నూరులో పెద్దిరెడ్డికి బ‌ల‌మైన పోటీ ఇస్తున్న నాయ‌కుడి గా కూడా ఆయ‌నకు పేరుంది.

Tags
Peddi reddy mithun reddy municipal poles
Recent Comments
Leave a Comment

Related News