ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల హీట్ పీక్స్‌కు చేరుకుంది. అయితే, ఈ పోరులో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రచారం సంగతి దేవుడెరుగు.. కనీసం నామినేషన్లు దాఖలు చేసేందుకు కూడా ఆ పార్టీ నేతలు ముందుకు రాకపోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. రాష్ట్రంలోని ఎనిమిది కీలక పురపాలక సంఘాల్లో వైసీపీ అభ్యర్థులను నిలబెట్టకపోవడంతో, ఆయా స్థానాలు అధికార కూటమికి ఏకగ్రీమం కావడం లాంఛనంగా మారింది.
ప్రకాశం జిల్లాలోని దర్శి, పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల, గురజాల నగర పంచాయతీలతో పాటు, వైఎస్ఆర్ కడప(YSR Kadapa) జిల్లాలోని యర్రగుంట్ల, మైదుకూరు, కమలాపురం, అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీల్లో ఈ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతాలన్నింటిలోనూ కేవలం కూటమి అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే ఈ పదవులన్నీ అధికారికంగా కూటమి ఖాతాలో చేరనున్నాయి.
మరోవైపు, వైసీపీ కంచుకోటలుగా చెప్పుకునే పులివెందుల(Pulivendula), పుంగనూరు, కమలాపురం వంటి ప్రాంతాల్లోనూ ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం పోటీ ఇచ్చే నాధుడు లేకపోవడంతో తొలిదశలో ఏకంగా 87 మున్సిపాలిటీల పరిధిలో వందలాది వార్డుల్లో వైసీపీ తరఫున ఎటువంటి నామినేషన్లూ దాఖలు కాలేదు. జమ్మలమడుగు, అనంతపురం జిల్లాలోని గూటిలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. జమ్మలమడుగులో ఏకంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి భార్య పేరును అభ్యర్థిగా ఖరారు చేసినప్పటికీ, అనూహ్యంగా ఆమె పోటీ నుంచి తప్పుకోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
అధికారంలో ఉన్నప్పుడు హవా నడిపించిన నేతలు, ప్రతిపక్షంలోకి వచ్చేసరికి గ్రౌండ్‌లో నిలబడి పోరాడే ధైర్యం చేయలేకపోతున్నారనే విమర్శలు వ్యూహాత్మకంగా వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందే ప్రతిపక్షం ఇలా చేతులెత్తేయడం రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. ఇది వైసీపీ(YCP) వ్యూహాత్మక మౌనమా? లేక క్షేత్రస్థాయిలో బలహీనపడటమా? అన్నది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.