విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వేడెక్కుతున్నాయి. వైసీపీ, జనసేనలు ఈ ఎన్నికల్లో కీలకంగా మారగగా.. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు తాను కూడా సై! అంటూ.. ప్రకటించారు. విజయవాడ కార్పొరేషన్ అభ్యర్థిగా ఆయన ఇండిపెండెం ట్గానే బరిలోకి దిగుతున్నట్టు తెలిపారు. విజయవాడపై తనకు మక్కువ ఎక్కువని పేర్కొన్న ఆయన.. తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇక, ఏబీ వెంకటేశ్వరరావుకు తాము మద్దతు ఇస్తున్నామని కమ్యూనిస్టు పార్టీలు సీపీఎం, సీపీఐలు ప్రకటించడం గమనార్హం. గత కొన్నాళ్లుగా వివిధ అంశాలపై గళం వినిపిస్తున్న ఏబీవీ.. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీతో కలిసి అంశాల వారీగా వేదికపై గళం వినిపిస్తున్నా రు. ఈ నేపథ్యంలోనే ఆయన కమ్యూనిస్టుల మద్దతు కోరారు.
కాంగ్రెస్ కోసం..
మరోవైపు.. విజయవాడ మేయర్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న తనకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించాలని వెంకటేశ్వరరావు కోరా రు. విజయవాడలో మార్పు తీసుకురావడంతోపాటు అభివృద్ధి దిశగా నడిపించేందుకు తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆయన లేఖ రాశారు. అయితే.. అసలు ఇప్పటి వరకు ఏపీలో జరుగుతున్న స్థానిక ఎన్నికల పై షర్మిల ఇప్పటికీ దృష్టి పెట్టకపోవడం, అభ్యర్థుల విషయాన్ని కూడా పట్టించుకోని పరిస్థితిలో ఏబీవీ అభ్యర్థనపై ఆమె ఎలా స్పందిస్తారన్న ది చూడాలి. ఇక, కమ్యూనిస్టులు ఇప్పటికే వెంకటేశ్వరరావుకు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆయా పార్టీల ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
చేతులు కలిపి..
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని సిపిఎం, సిపిఐ నిర్ణయించాయి. మేయర్ అభ్యర్థిగా ఏబి. వెంకటేశ్వ రావుకి మద్దతు ప్రకటించిన సిపిఐ, సిపిఎం.. వివిధ కార్పొరేటర్ స్థానాలకు ఉమ్మడిగా పోటీ చేయాలని, అభ్యర్థులను కూడా ఉమ్మడిగానే ఎంపిక చేయాలని నిర్ణయించాయి. సిపిఐ, సిపిఎం పోటీ చేయాల్సిన స్థానాలపై ఉమ్మడి అవగాహనకు వచ్చినట్టు కూడా నాయకులు తెలిపారు. కాంగ్రెస్, ఇతర వామపక్ష పార్టీలతోనూ చర్చలు కొనసాగించి అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇదిలావుంటే, రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీలలో జరిగే ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు ఆదివారం(అక్టోబరు 18)తో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లను తీసుకుంటారు. అనంతరం.. 19వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది.
ఏబీవీ బలమెంత?
బెజవాడ బరి నుంచి రంగంలోకి దిగుతున్న ఏబీ వెంకటేశ్వరరావు బలాబలాల విషయానికి వస్తే..ఆయన నగరంలో పోలీసు కమిషనర్గా పనిచేసిన అనుభవం ఉంది. ఉమ్మడి కృష్ణాజిల్లా సొంత ప్రాంతమే అయినా.. రాజకీయంగా ఆయనకు ప్రాధాన్యం తక్కువగానే ఉంది. మాస్ ప్రజలకు ఆయన ముఖ పరిచయం కూడా తక్కువే. మేధావి వర్గంలోనూ ఆయనకు ఫాలోయింగ్ పెద్దగా లేదని అంటున్నారు. ఈ క్రమంలో ఏదో పోటీ చేయాలని చేయడం తప్ప.. మరో కోణం కనిపించడం లేదన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. ఇక, కమ్యూనిస్టులు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు ఏమేరకు ఓట్లు దక్కుతాయో చూడాలి.