విజ‌య‌వాడ మేయ‌ర్ సీటు వంగ‌వీటికే.. కానీ!

admin
Published by Admin — October 18, 2026 in Politics
News Image

ఇటీవ‌ల టీడీపీ నుంచి జ‌న‌సేన పార్టీలోకి చేరిన వంగ‌వీటి రంగా వార‌సుడు వంగ‌వీటి రాధాకృష్ణ‌కు విజ‌య‌వాడ మేయ‌ర్ సీటును ఇస్తార‌న్న ప్ర‌చారానికి ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డింది. ఆయ‌న‌ను మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తూ.. జ‌న‌సేన పార్టీ అధికారిక జాబితా వెలువ‌రించింది. స్థానిక ఎన్నిక‌ల్లో నాలుగు కార్పొరేష‌న్లు, 21 మునిసిపాలిటీ చైర్మ‌న్ సీట్ల‌ను ద‌క్కించుకున్న జ‌న‌సేన పార్టీ తాజాగా మ‌రో జాబితా ప్ర‌క‌టించింది. దీనిలో విజ‌య‌వాడ మేయ‌ర్ అభ్య‌ర్థిగా వంగవీటి రాధాకృష్ణ, ఏలూరు కార్పొరేష‌న్ మేయ‌ర్ అభ్య‌ర్థిగా రెడ్డి అప్పలనాయుడుల‌ను పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.

రెడ్డి అప్ప‌ల‌నాయుడు జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొన‌సాగుతున్నారు. 2019లో ఏలూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన జెండాపై పోటీ చేశారు. అయితే.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌, వైసీపీ హ‌వా నేప‌థ్యంలో ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు. గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ ఆశించినా.. పొత్తులో భాగంగా ఆయ‌న‌కు ద‌క్క‌లేదు. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్‌గా, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియ‌మించారు. పార్టీకి న‌మ్మ‌క‌స్తుడు, ప‌వ‌న్ ప‌ట్ల విధేయ‌త‌ను చాటుకునే.. రెడ్డి అప్ప‌ల‌నాయుడు ఎంపిక‌పై జ‌న‌సేన‌వ‌ర్గాల్లో సానుకూల ధోర‌ణి నెల‌కొంది.

రాధా ప‌రిస్థితి ఇదీ..

ఇక‌, విజ‌య‌వాడ వంటి బ‌ల‌మైన రాజ‌కీయ శ‌క్తులు ఉన్న న‌గ‌రంలో కార్పొరేష‌న్ మేయ‌ర్ పీఠం ద‌క్కించుకునేందుకు వంగ‌వీటి రాధా ఏమేరకు క‌ష్ట‌ప‌డ‌తార‌న్న విష‌యంపైనే ఆయ‌న విజ‌యం ఆధార‌ప‌డి ఉంటుంది. భిన్న‌మైన రాజ‌కీయాలు.. విభిన్న‌మైన నాయ‌కులు ఉన్న నేప‌థ్యంలో రాధా ఎంపిక బాగానే ఉన్నా.. కాపు సామాజిక వ‌ర్గం, క‌మ్మ వ‌ర్గాల క‌ల‌యిక అత్యంత‌కీల‌కం. ముఖ్యంగా తూర్పు, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల్లో వ్యాపారులు, పారిశ్రామిక వేత్త‌లు ఎక్కువ‌గా ఉండ‌డం.. మాస్ జ‌నాలు ఉండ‌డం కొంత వ‌ర‌కు క‌ల‌సి వ‌స్తున్నా.. రాజ‌కీయంగా కూట‌మి నాయ‌కుల మ‌ధ్య కొర‌వ‌డి రాజ‌కీయం మాత్రం రాధాకు అగ్నిప‌రీక్ష‌గా మార‌నుంది.

మున్సిపల్ త‌ల‌నొప్పులు!

జ‌న‌సేన పార్టీ ప్ర‌క‌టించిన మునిసిప‌ల్ చైర్మ‌న్ అభ్య‌ర్థుల విష‌యానికి వ‌స్తే.. ఈ ఎంపిక‌ల‌పై కొన్నికొన్ని స్థానాల్లో నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతు న్నాయి పార్టీలో ఉన్న‌వారికి అవ‌కాశం ల‌భించ‌లేద‌న్న వాద‌నా వినిపిస్తోంది. అమలాపురం: నల్లా శ్రీధర్‌, చిలకలూరిపేట : తోట రాజేశ్వరి వంటివారిని ఎంపిక చేయ‌డంపై నాయ‌కులు అవాక్క‌వుతున్నారు. ఇక‌, తిరువూరులో మాధ‌వి ఎంపిక కూడా విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. న‌ర‌సాపురంలో కొత్త‌ప‌ల్లి శైల‌జ‌కు అవ‌కాశం ఇచ్చినా.. నాయ‌కుల స‌మ్మ‌తి తీసుకోలేద‌ని అంటున్నారు. ఇలా.. చాలా మునిసిప‌ల్ చైర్మ‌న్ల ఎంపిక వ్య‌వ‌హారం జ‌న‌సేన‌కు త‌ల‌నొప్పిగా మారే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

Tags
Vijayawada mayor vangaveeti Radha
Recent Comments
Leave a Comment

Related News