ఏపీ సీఎం చంద్రబాబును అభినందిస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా లేఖ రాశారు. దసరా శరన్నవరా త్రుల సందర్భంగా ఆదివారం నుంచి `విజయవాడ ఉత్సవ్ 2.0` పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రు. విజయవాడ సహా పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలపై మీడియాలో విస్తృత కథనాలు వచ్చాయి. తాజాగా వీటిపై స్పందించిన ప్రధాని మోడీ.. చంద్రబాబు దూరదృష్టి భేష్ అంటూ ప్రశంసలు గుప్పించా రు. విజయవాడ సహా.. చుట్టుపక్కల ప్రాంతాల బ్రాండ్ వాల్యూ పెంచేందుకు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.
``ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ ఉత్సవపు రెండవ ఎడిషన్ జరుగుతోందని తెలుసుకోవడం సంతోషకరమైన విష యం. ఈ చొరవకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వానికి, విజయవాడ ప్రజలకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితంలో విజయవాడకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పవిత్రమైన కృష్ణా నది, పూజ్యమైన కనక దుర్గ ఆలయం ఉన్న ఈ నగరానికి గొప్ప వారసత్వం ఉంది. ఒక నగర ప్రజలు తమ సంప్రదాయాలతో మమేకమై, వాటిని తర్వాతి తరానికి అందించినప్పుడే ఆ నగర సంస్కృతి నిలిచి ఉంటుంది.`` అని మోడీ తన లేఖలో పేర్కొన్నారు.
విజయవాడ ఉత్సవం ఈ వారసత్వాన్ని దైనందిన జీవితంలోకి తీసుకురావడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తూ, అదే సమయంలో ఈ ప్రాంతంలోని కళాకారులు, పారిశ్రామికవేత్తలకు కొత్త మార్గాలను సుగమం చేస్తుందని మోడీ వ్యాఖ్యానించారు. ఇది పర్యాటక రంగానికి కూడా ఒక కొత్త ఉత్తేజాన్ని అందిస్తుందన్నారు. ఈ ఉత్సవం నైపుణ్యాభి వృద్ధిపై కూడా దృష్టి సారిస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని తెలిపారు. అభివృద్ధి చెందిన భారతదేశం అనే దార్శనికతతో ముందుకు సాగుతున్న కొద్దీ, మన నగరాలు తమ విశిష్ట సాంస్కృతిక గుర్తింపును సజీవంగా ఉంచుకునే రీతిలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
ఈ విషయంలో ఇటువంటి కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవని ప్రధాని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని లేఖలో తెలిపారు. ఈ పండుగ విజయవాడ ప్రజలకు, వారి గొప్ప సాంస్కృతిక వారసత్వానికి మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా.. గత ఏడాది నుంచి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్ పేరుతో దసరా సమయంలో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.