ఓ పక్క ఏపీలో పాలనను గాడిలో పెట్టే పనిలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు బిజీగా ఉంటే...మరో పక్క టీడీపీలో కొందరు నేతలు అంతర్గత కుమ్ములాటలు, క్రమశిక్షణా రాహిత్యం తో ఆయనను, పార్టీని ఇబ్బందిపెడుతున్నారు. చంద్రబాబుకు సహకరించకపోయినా పర్వాలేదుగానీ...ఆయనను ఈ పంచాయతీలతో ఇరకాటంలో పడేస్తున్నారు. ముఖ్యంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం, దాంతోపాటు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబంధించిన వివాదాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి.
ఈ క్రమంలోనే పార్టీలో అంతర్గత విభేదాల పరిష్కారంపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ వ్యవహారాలపై పల్లా లోతుగా విచారణ చేపట్టారు. ఆయా నేతలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి వివరణ తీసుకున్నారు. కొలికపూడి శ్రీనివాసరావు, రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య లమధ్య విభేదాలపై ఆయన ఆరా తీశారు. ఆ ఇద్దరితో విడివిడిగా భేటీ అయ్యారు. వారు చేసుకుంటున్న ఆరోపణలు, పార్టీకి అందిన ఫిర్యాదులపై చర్చించారు.
ఏవైనా విభేదాలుంటే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని, పార్టీ అంతర్గత వ్యవహారాలను అనవసరంగా రోడ్డుమీదకు లాగొద్దని హితవు పలికారు. వివాదాలకు తావు లేకుండా జాగ్రత్త వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక, చింతమనేనిపై వచ్చిన టోల్‌ప్లాజా ఘటన ఆరోపణలపై కూడా పల్లా విచారణ జరిపారు. టోల్‌ప్లాజా సిబ్బంది, లారీ డ్రైవర్లు అందించిన సమాచారాన్ని బట్టి ఈ వివాదంతో చింతమనేనికి సంబంధం లేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వ్యక్తిగత విమర్శలకు పోవద్దని, పార్టీ క్రమశిక్షణ లైన్ దాటొద్దని సూచించారు. పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.