జగన్ ప్లాన్ రివర్స్.. వైసీపీ ఖాళీ!

admin
Published by Admin — September 28, 2026 in Andhra
News Image
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా స్థానిక సంస్థల ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో రాబోయే లోకల్ బాడీ పోరుకు అన్ని పార్టీలు సిద్ధమవుతుండగా.. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఊహించని సంక్షోభం తలెత్తింది. ప్రతి నియోజకవర్గం, ప్రతి పంచాయతీ, చివరికి వార్డు స్థాయి వరకు కూడా తగ్గేదేలేదంటూ.. అన్ని స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి కార్యాలయం నుంచి గట్టి హుకుం జారీ చేశారు. పార్టీ శ్రేణుల్లో పోరాట పటిమను నింపే లక్ష్యంతో అధినాయకత్వం ఈ ప్లాన్ వేసినప్పటికీ, క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం పూర్తిగా తలకిందులవుతున్నాయి. జగన్ వేస్తున్న ఈ వ్యూహాలు అన్నీ ఒక్కొక్కటిగా రివర్స్ అవుతుండటంతో పార్టీ గూడు ఇప్పుడు పూర్తిగా ఖాళీ అవుతోంది.
 
గత సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి అధికార మార్పిడి షాక్‌లో ఉన్న వైసీపీ క్యాడర్‌కు, ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల భయం మరింత నిద్రలేకుండా చేస్తోంది. గ్రామాల్లో సొంత పలుకుబడి, బలమైన ఓటు బ్యాంకు ఉన్న ఏ స్థానిక నాయకుడైనా తాము ఏ గుర్తింపుతో ప్రజల్లోకి వెళ్తే గెలుస్తామనే దానిపై స్పష్టతతో ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, దూకుడుగా సాగుతున్న పాలన చూశాక.. ప్రజలు ఏ వైపు ఉన్నారో లోకల్ లీడర్లకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇలాంటి తరుణంలో ఇప్పటికే ఓడిపోయి, ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్న వైసీపీ సానుభూతిపరులుగా లేదా ఆ పార్టీ గుర్తుపై బరిలోకి దిగితే కనీస డిపాజిట్లు కూడా దక్కవనే సత్యం వారికి బోధపడుతోంది. అందుకే, అధినేత ఆదేశాలను లెక్కచేయకుండా తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు నేతలు స్వచ్ఛందంగా పక్కచూపులు చూస్తున్నారు.
 
ఉత్తరాంధ్ర నుంచి గోదావరి వరకు వలసల వరద..
ఈ అసంతృప్తి కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలోనూ కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జరుగుతున్న వరుస పరిణామాలు వైసీపీ పతన వేగానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కీలక నేతలైన మాజీ మంత్రులు, జడ్పీ చైర్మన్లు, నియోజకవర్గ సమన్వయకర్తలు సైతం పార్టీ వీడుతుండటంతో కిందిస్థాయి శ్రేణులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నాయకుడే పార్టీ మారుతున్నప్పుడు తాము మాత్రం ఆ పార్టీలో ఎందుకు కొనసాగాలనే ఆలోచనతో ద్వితీయ శ్రేణి లీడర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున వలస బాట పట్టారు. జనసేన, టీడీపీ వైపు పరుగులు పెడుతున్న ఈ నేతల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది.
 
అసలు వైఎస్సార్‌సీపీకి భవిష్యత్తు ఉందా అనే మీమాంస ఇప్పుడు ఆ పార్టీలోని అగ్రనేతల మదిలోనే మెదులుతోంది. గత ఐదేళ్ల పాలనా సరళిపై ప్రజలు ఇచ్చిన భారీ తీర్పు నుంచి తేరుకోలేకపోతున్న తాడేపల్లి పెద్దలు.. కేవలం హుకుంలు జారీ చేయడమే తప్ప, క్యాడర్‌కు భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. సమస్య ఎక్కడ ఉందో బేరీజు వేసుకుని సరిదిద్దుకోవడానికి బదులుగా, పాత పద్ధతిలోనే బెదిరింపులు లేదా బలవంతపు ఆదేశాల మీద ఆధారపడుతుండటంతో ఫలితం శూన్యమవుతోంది.
 
ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ జెండా మోసే నాథుడు కరువవుతుండగా.. రాబోయే నామినేషన్ల ప్రక్రియ నాటికి ఈ వలసల విశ్వరూపం మరింత స్పష్టంగా బయటపడే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సమయానికి పోటీ చేయడానికి కనీసం అభ్యర్థులు కూడా దొరకని దయనీయ స్థితికి పార్టీ చేరుతుందనడంలో సందేహం లేదు. మరి ఈ భారీ సంక్షోభాన్ని తాడేపల్లి అగ్రభాగం ఎలా ఎదుర్కొంటుందో, లేక ఈ వలసల ప్రవాహంలో పార్టీ పూర్తిగా కొట్టుకుపోతుందో వేచి చూడాలి.
Tags
ycp jagan plan reverse
Recent Comments
Leave a Comment

Related News