ప్రస్తుతం ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వానికి షాక్ ఇవ్వాలన్నది వైసీపీ అధినేత జగన్ ఉద్దేశం... అయితే.. తానే ఒంటరిగా వెళ్లి.. పోటీ చేసి 2024లో భంగ పడిన నేపథ్యంలో ఇప్పుడు తనకు కలిసి వచ్చే వారితో ఆయన చేతులు కలుపుతున్నారు. వాస్తవానికి కమ్యూనిస్టులు 2024లో కూడా జగన్తో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించారు. కానీ.. జగన్ మాత్రం `సింగిల్ సింహం` అంటూ.. ఎవరితోనూ చేతులు కలిపేందుకు మొగ్గు చూపలేదు.
ఇక, గత ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితం కావడం.. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కక పోవడంతో జగన్కు ఆ పరిణామాలు మింగుడు పడడం లేదు. మరోవైపు.. నమ్ముకున్న నాయకులు ఒక్కొక్కరుగా కాడి పడేస్తున్నారు. తెల్లారితే పార్టీ పరిస్థితి ఏంటి? ఏ నాయకుడు ఉంటారు? ఏ నాయకుడు చిత్తగిస్తాడు? అనే సందేహాలు పార్టీలో ముసురుకున్నాయి. ``సర్ అంతా మీవెంటే..`` అంటూ ఇలా చెప్పి.. అలా పార్టీ మారిపోయిన మజ్జి శ్రీను, యనమల కృష్ణుడు వంటివారు ఎందరు ఉన్నారో.. పార్టీ లెక్కలు వేస్తోంది.
ఈ నేపథ్యంలో పార్టీ కేడర్ కూడా దిగాలు పడింది. ఒకవైపు.. దూకుడు నిర్ణయాలు లే కపోవడం, డిఫెన్సులో పడ డం.. సీనియర్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, జగన్ వైఖరి వంటివి పార్టీని పుట్టిముంచుతున్న పరిస్థితిలో.. ఇప్పుడు సింగిల్ సింహం.. పక్క చూపులు చూడక తప్పని పరిస్థితి ఏర్పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మొత్తానికి మొసం తప్పదన్న హెచ్చరికలు కూడా పార్టీని వెంటాడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్టులతో చేతులు కలిపేందుకు జగన్ తలూపారని అంటున్నారు. అయితే.. దీనికి కూడా కొన్ని హద్దులు నిర్ణయించుకున్నారన్న వాదన వినిపిస్తోంది. కేవలం తాము సూచించిన పోరాటలకే పరిమితం అవ్వాలని.. ఉమ్మడిగా పేరు తెచ్చే వాటికి కాదని అంటున్నట్టు వినికిడి. దీనికి కమ్యూనిస్లులు అంతర్గత చర్చల్లో నిర్ణయించి ఒక దారికి రానున్నారు. ఏదేమైనా.. వారొచ్చి.. జగన్తో కలిసినా.. వైసీపీనే నేరుగా కమ్యూనిస్టులతో కలిసినా.. పెద్దగాప్రయోజనం లేదని టీడీపీ ఎద్దేవా చేస్తోంది. కమ్యూనిస్టులు కేవలం పేరుకేనని.. వారితో కలిసి ఏ పార్టీ కూడా పుంజుకున్న చరిత్ర లేదని తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు.