రాజకీయాల్లో కర్మ సిద్ధాంతం గురించి చాలాసార్లు చర్చిస్తుంటాం. "మనం చేసిన పనులే తిరిగి మనల్ని వెంటాడుతాయి" అనే మాటకు అంబటి రాంబాబు తాజా వ్యాఖ్యానాలు అచ్చంగా సరిపోతాయి. వైసీపీ(YCP) హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తంతును ఏపీ ప్రజలు ఇప్పటికీ మరువలేరు. ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా గదుల్లో బంధించడం, పత్రాలు చింపేయడం వంటి ఘటనలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అప్పట్లో అధికారాన్ని అడ్డంపెట్టుకుని సాగించిన ఆ దౌర్జన్యాలే నేడు తమకు శాపంగా మారాయని వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు పరోక్షంగా అంగీకరించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
మద్యం రవాణాకు సంబంధించి ఈడీ విచారణకు హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు(Ambati Rambabu) ఊహించని రీతిలో స్పందించారు. గతంలో తాము కూడా అక్రమాలకు పాల్పడ్డాం కాబట్టే, ఇప్పుడు తమకూ అదే గతి పట్టిందంటూ ఆయన నిర్భయంగా ఒప్పుకోవడం విశేషం. అయితే ఇక్కడితో ఆగలేదు. భవిష్యత్తులో ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా ఫలితాలు ఇలాగే ఉంటాయని, ఒకవేళ 2029లో మళ్లీ తాము అధికారంలోకి వస్తే మాత్రం.. అప్పుడు ఇంకా ఏ స్థాయిలో దారుణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామోనంటూ అంబటి పరోక్షంగా ఇచ్చిన వార్నింగ్ చూస్తే వీళ్ల బుద్ధి ఎప్పటికీ మారదు కదా అనిపించక మానదు. గతంలో తాము చేసిన తప్పులను సరిదిద్దుకోవడం పోయి, భవిష్యత్తులో మరింత చెలరేగిపోతామని బెదిరింపులకు దిగడం చూస్తుంటే వైసీపీ నేతల ఫ్రస్ట్రేషన్ ఏ లెవెల్‌లో ఉందో అర్థమవుతోంది.
ఇక ఇదే విచారణలో మద్యం రవాణా సబ్ కాంట్రాక్టుల వ్యవహారంపై ఈడీ(ED) అధికారులకు అంబటి ఇచ్చిన సమాధానాలు కూడా ఆసక్తికరంగా మారాయి. పార్టీ నేతలు పురుషోత్తం, సుబ్బారెడ్డి తమ పని మీద తన దగ్గరకు వస్తే సబ్ కాంట్రాక్ట్ కోసం సిఫారసు చేసిన మాట వాస్తవమేనని ఆయన స్పష్టం చేశారు. తన దగ్గరకు వచ్చిన వారికి తాను 'నో' చెప్పలేనని, తన స్థాయికి తగ్గట్టుగా వారికి సాయం చేస్తానంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మొత్తానికి, గతం తాలూకు చేదు జ్ఞాపకాలను, నాటి అక్రమాలను వైసీపీ(YCP) నేత స్వయంగా బయటపెట్టడం ద్వారా రాజకీయాల్లో మరోసారి పెద్ద చర్చకు తెరలేపారు. ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను స్వయంగా ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్న తీరు చూస్తుంటే, రాజకీయాల్లో కర్మ సిద్ధాంతం ఎంత పక్కాగా పనిచేస్తుందో ఇట్టే అర్థమవుతోంది.