అసెంబ్లీ గేట్లు మూసుకుపోతేనేమి, సభ నుంచి సస్పెన్షన్ వేటు పడితేనేమి... గులాబీ పార్టీ నేతలకు మాత్రం మెదడులో పాత రికార్డే మోగుతోంది. అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టేందుకు కొత్త అస్త్రాలు వెతకడం చేతకాక, మళ్లీ పాత పాటనే అందుకున్నారు. శాసనసభ సమావేశాలు జరిగినా, లేకపోయినా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) పేరు ఉచ్ఛరించకపోతే వారికి నిద్రపట్టదన్నట్లుగా తయారైంది నేతల తీరు. అసలు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం లేక రోడ్డు మీద మాక్ అసెంబ్లీ నిర్వహిస్తే, అక్కడ కూడా ప్రధాన ఎజెండా మాత్రం బాబు జపమే కావడం గమనార్హం.
ఈ నకిలీ అసెంబ్లీ నాటకంలో భాగంగా బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏకంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర పోషించి వింత విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వ పనితీరు బాగోలేదని, చంద్రబాబు ఇచ్చే స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుంటున్నామంటూ ఆయన చేసిన వ్యంగ్య నాటకం చూస్తుంటే, పరాధీనత ఎవరికి ఉందో వారే స్వయంగా ఒప్పుకుంటున్నట్లుంది. రేవంత్ ప్రభుత్వాన్ని విమర్శించే సత్తా లేక, ప్రతీదానికి చంద్రబాబును తెరపైకి తెచ్చి కాలు కదపడం బీఆర్ఎస్ నైజాన్ని మరోసారి బయటపెట్టింది.
గతంలో గులాబీ బాస్ కేసీఆర్(KCR), ఏపీలో జగన్మోహన్ రెడ్డితో కలిసి రాజకీయాలు నడిపిన రోజులను జనం ఇంకా మరువలేదు. అమరావతిని పక్కన పెట్టి, పోలవరం పనులను నిలిపివేసి, పరిశ్రమలను పొరుగు రాష్ట్రానికి తరలించేలా సహకరించుకున్న గురు-శిష్యుల బంధం ఎవరికి తెలియదు? కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించి బటన్ నొక్కించిన చరిత్ర ఎవరిది? కృష్ణా, గోదావరి జలాల దోపిడీపై ఏపీ ప్రభుత్వాలు ఏనాడు సరిగ్గా స్పందించినా, కేసీఆర్ మాత్రం కేవలం రాజకీయ లబ్ధి కోసమే బాబు పేరును వాడుకుంటూ వచ్చారన్నది బహిరంగ రహస్యమే.
ఎన్నికల్లో ఓడిపోయి ప్రజలు బుద్ధి చెప్పినా గులాబీ శ్రేణుల అహంకార పూరిత బుద్ధి మాత్రం మారలేదు. తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఎదురుగా పోరాడాల్సింది రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో. కానీ ఆ ధైర్యం చాలక ప్రతిసారీ చంద్రబాబును బూచిగా చూపడం వారి బలహీనతకు నిదర్శనం. ప్రజలు ఎంతో నమ్మి కట్టబెట్టిన అధికారాన్ని నిర్దాక్షిణ్యంగా లాగేసుకున్నా, ఈ నేతల తీరులో మాత్రం ఇంచు కూడా మార్పు రాలేదు. ఇదే విధంగా ప్రజల తీర్పును గౌరవించకుండా పాత పద్ధతిలోనే నెట్టుకొస్తే, రాబోయే రోజుల్లో ప్రజల నుంచి మరోసారి గట్టిగా రిటర్న్ గిఫ్ట్ అందుకోవడం ఖాయం.