శ్రీసత్యసాయి జిల్లాలోని హైప్రొఫైల్ నియోజకవర్గమైన హిందూపురంలో రాజకీయం పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్ నటుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) చుట్టూనే ఇక్కడి రాజకీయం గిరికీలు కొడుతోంది. గత ఎన్నికల్లో సాధించిన ఘన విజయాలతో పాటు, పార్లమెంట్ స్థానాన్ని కూడా కూటమి అభ్యర్థి కైవసం చేసుకోవడంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ తారాస్థాయికి చేరింది. స్థానిక సంస్థల పీఠాలపై స్పష్టమైన పట్టు బిగిస్తున్న ఆ పార్టీ, రాబోయే ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంగా పావులు కదుపుతోంది.
ముఖ్యంగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికల్లో టీడీపీ(TDP) అభ్యర్థి రమేష్ కుమార్ విజయం సాధించడం ఆ పార్టీ సత్తా ఏంటో మరోసారి నిరూపించింది. గతంలో బలంగా ఉన్నప్పటికీ, సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రభావంతో వైసీపీ కేడర్ పూర్తిగా డీలా పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఏకంగా 13 మంది కౌన్సిలర్లు సైతం పార్టీ వీడి కూటమికి మద్దతు ప్రకటించడం ఫ్యాన్ శిబిరంలో తీవ్ర కలకలం రేపింది. మెజారిటీ స్థానాలతో స్థానిక సంస్థలపై టీడీపీ తన జెండా పాతడం ఖాయమని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
మరోవైపు వైసీపీ(YCP) పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒంటెత్తు పోకడలు, సమన్వయ లోపం ఆ పార్టీ కొంపముంచుతున్నాయి. స్థానిక నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో కేడర్ దిక్కుతోచని స్థితిలో పడింది. నాయకత్వ లేమి, అంతర్గత కుమ్ములాటలతో పునాదులే కదులుతున్న వేళ, వైసీపీ ఇక్కడ కోలుకోవడం కష్టమనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
సంక్షేమ పథకాల అమలు వేగవంతం కావడం, ప్రభుత్వ హామీలకు తోడు బాలకృష్ణ(Balakrishna) వేస్తున్న రాజకీయ అడుగులు హిందూపురంలో టీడీపీని మరింత తిరుగులేని శక్తిగా మారుస్తున్నాయి. ప్రత్యామ్నాయ నేతలు లేక, ప్రజల్లోనూ పట్టు కోల్పోయి సతమతమవుతున్న వైసీపీకి... బాలయ్య దూకుడుకు అడ్డుకట్ట వేయడం తలకు మించిన భారంగా మారింది. మొత్తానికి ఈ పరిణామాలు హిందూపురంలో టీడీపీ కంచుకోటను మరింత పటిష్టం చేస్తుండగా, వైసీపీ కథ మాత్రం ముగింపు దశకు చేరినట్లు స్పష్టమవుతోంది.