ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వయసు 75 సంవత్సరాలు. అయితే.. చిత్రంగా నేటి యువత ఆయనకు ఎటాచ్ అవుతుండడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యంగా మారింది. అటు సోషల్ మీడియాలోను.. ఇటు బహిరంగ వేదికలపై కూడా యువత చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. తాజాగా ఆయన పాల్గొన్న సభలో యువత పెద్ద ఎత్తున జై-చంద్రబాబు నినాదాలతో హోరెత్తించింది. ఇది ఆయనకే కాదు.. పార్టీ కేడర్‌లోనూ సంతోషాన్ని నింపింది. సోషల్ మీడియాలోనూ ప్రస్తుతం "జెన్‌జీ" గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు జెన్‌జీ చేరువ కావడం వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందన్న అంచనాలు వస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'జెన్-జీ' ప్రస్తావన తెచ్చారు. అధికారులు ఏసీ గదుల్లో కూర్చొని ప్రజా సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే, హక్కుల కోసం ప్రశ్నించే నేటి జెన్‌జీ యువత ఊరుకోదని, నిలదీస్తుందని ఆయన హెచ్చరించారు. తమకు అన్యాయం జరిగిందని భావిస్తే తిరగబడటం ఈ తరం నైజమని, అందుకే అధికారులు మానవీయ కోణంలో సమస్యలను పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు.
ఇక, తానే జెన్‌జీ అంటూ..
కాక్రోచ్ ఉద్యమంకొనసాగిన సమయంలో జెన్‌జీ గురించి మాట్లాడిన చంద్రబాబు.. తానే అందరికన్నా పెద్ద జెన్‌జీ అని వ్యాఖ్యానించారు. వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఇన్నోవేటివ్‌గా ఆలోచించడమే తన నైజమని కూడా ఆయన పేర్కొన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవుతున్నారు. గతంలో కొన్ని సందర్భాలకు మాత్రమే పరిమితం అయిన.. ఆయన ఇప్పుడు ప్రతి విషయాన్నీ సోషల్ మీడియాలో పంచుకుంటూ.. యువతకు చేరువ అవుతున్నారు.
యువతను ప్రోత్సహించేలా..
సీఎంగా చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉన్నా.. యువతను ఆకర్షించేలా తన వ్యూహాలకుపదును పెంచుకుంటు న్నారు. ఇది కూడా జెన్‌జీకి ఆయనను చేరువ చేస్తోంది. స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచిప్రోత్సాహకాలు ఇస్తున్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పెట్టుబడులు తెస్తున్నారు. యువత ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. సరికొత్త ఆవిష్కరణలకు ప్రభుత్వం తరఫున మద్దతు ఇస్తున్నారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. దీంతో నేటి డిజిటల్ తరం ఆయనకు కనెక్ట్ అవుతోందన్న అంచనాలు ఉన్నాయి.