రాజకీయాల్లో ఓటమి సహజం. కానీ, అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో మొదలయ్యే అంతర్గత కుదుపులు, నమ్మిన నేతల వలసలు ఏ నాయకుడినైనా మానసికంగా కుంగదీస్తాయి. సరిగ్గా ఇదే పరిస్థితిని ఇప్పుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఎదుర్కొంటున్నారు. పదవులు, ప్రయోజనాలు అన్నీ అనుభవించి, చివరికి అధికారం దూరమవ్వగానే పార్టీని వీడుతున్న నేతల తీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిణామాలు చూస్తున్న రాజకీయ పరిశీలకుల నుంచి ఒకటే ప్రశ్న వినిపిస్తోంది... "జగన్‌కు ఇప్పటికైనా ఇది అర్థమవుతుందా..?" అని.
సాధారణంగా ఏ పార్టీలోనైనా ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు, టికెట్లు దక్కని వారు లేదా పదవులు రాని అసంతృప్త నేతలు పార్టీ మారడం సహజం. కానీ, వైసీపీ(YCP)లో జరుగుతున్న పరిణామాలు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఏకంగా ఒకదాని కంటే ఎక్కువ పదవులు దక్కించుకున్న వారు, అధినాయకత్వంతో అత్యంత సన్నిహితంగా మెలిగినవారే వరుసగా హ్యాండ్ ఇస్తున్నారు. ఆళ్ళ నాని, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, విజయసాయిరెడ్డి, తాజాగా చిన్న శ్రీను వంటి సీనియర్లతో పాటు, ఎమ్మెల్సీలుగా, నామినేటెడ్ పదవులతో చెలమలాడిన వారు సైతం గుడ్ బై చెప్పడం పార్టీలో ఇప్పుడు తీవ్ర కలవరం రేపుతోంది.
ఈ వలసల పరంపరను నిశితంగా పరిశీలిస్తే... ఒక కీలకమైన లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పదవుల కేటాయింపులో కేవలం సామాజిక సమీకరణాలు, వ్యక్తిగత ఎమోషనల్ అటాచ్మెంట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిజంగా కష్టపడే సాధారణ కార్యకర్తలను, కేడర్‌ను విస్మరించడమే ఈ అనర్థాలకు మూలమని పార్టీలో ఇప్పుడు బహిరంగంగానే చర్చ జరుగుతోంది. పదవులతో పూర్తిగా సంపన్నులైన వారు, అధికారం లేకపోగానే పడవ దిగిపోవడం ఖాయమనే కనీస అంచనా అధిష్టానానికి లేకపోవడం పెద్ద లోపంగా మారింది.
ఇప్పటికైనా వైఎస్ జగన్(YS Jagan) తన రాజకీయ శైలిని, నేతల ఎంపిక విధానాన్ని మార్చుకోకపోతే నష్టం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. పదవులను కేవలం అలంకార ప్రాయంగా, కాపలా కుక్కల్లా మార్చడం కాకుండా... పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి, కష్టకాలంలో వెన్నంటి నిలిచే నిజమైన కేడర్‌కు పెద్దపీట వేయాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే, అన్నీ అడిగి మరీ తీసుకుని, అవసరానికి వాడుకుని వదిలేసే సంస్కృతి వైసీపీకి మరింత శాపంగా మారుతుంది. మరి ఈ చేదు నిజాన్ని జగన్ త్వరగా గ్రహిస్తారా? లేదా? అన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్న.