తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేడి వేడి పూరీలు వండుతున్నారు...స్వయంగా పూరీ రోల్ చేసి వేడి వేడి నూనెలో వేస్తున్నారు...అయితే, పూరీలు గుండ్రంగా సర్కిల్ షేప్ లో రావడం లేదని కంప్లయింట్ వచ్చింది...రేవంత్ రెడ్డి చేస్తున్న పూరీలు ఓవల్ షేప్ లో ఉన్నాయని ఫిర్యాదు అందింది...దీంతో, ఓవల్ షేప్ లోని పూరీలను రౌండ్ గా చేస్తానని రేవంత్ అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పూరీలు చేయడం ఏంటి? చేసితిరి పో...ఆ పూరీలు రౌండ్ గా లేవని కంప్లయింట్ రావడం ఏంటి? వచ్చినది పో...ఆ వెంటనే ఆయన రౌండ్ గా పూరీలు చేస్తానని చెప్పడం ఏంటి? అని అనుకుంటున్నారా? ఇదేదో ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ చేసి ఉంటారేమో అన్న డౌట్ వచ్చిందా? అలా అనుకుంటే మీరు పూరీ కూరలో కాలేసినట్లే! తన ముద్దుల మనవడు రేయాన్ష్ (రుద్రదేవ్) అడగడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చెఫ్ గా మారి పూరీలు చేసిన సందర్భంగా తాతామనవళ్ల మధ్య జరిగిన సంభాషణ ఇది.
అవును, ‘‘తాతా నువ్వు పూరీలు వేస్తేనే తింటా’’ అని తన తాత రేవంత్ రెడ్డిని మనవడు రేయాన్ష్ గారాబంగా అడిగాడు. తన గారాల పట్టి అయిన రుద్రదేవ్ ప్రేమగా అడిగితే రేవంత్ కాదంటారా? వెంటనే రంగంలోకి దిగి పూరీలు చేయడం మొదలుబెట్టారు. అయితే, తాత రేవంత్ పూరీలు సరిగ్గా చేస్తారో లేదో అని డౌట్ వచ్చిన రేయాన్ష్ వంటగదిలో తాత పక్కనే కూర్చొని మరీ పూరీలు ఏ షేప్ లో వస్తున్నాయో అని టెస్ట్ చేస్తున్నాడు.
పూరీలు చాలా....ఇంకా కావాలా అంటూ రేయాన్ష్ ను రేవంత్ అడిగారు...అయితే, అమ్మమ్మకు కూడా కావాలని అడగడంతో చేసిస్తానంటూ ముసిముసి నవ్వులు నవ్వారు రేవంత్. ఇక, పూరీలు రౌండ్ గా లేవని తాతకు కంప్లయింట్ చేశాడు మనవడు. దీంతో, ఓవల్ షేప్ ను రౌండ్ గా చేస్తానంటూ నవ్వుకుంటూ పూరీని రౌండ్ గా చేసే పనిలో పడ్డారు రేవంత్ రెడ్డి. ఇలా తాతామనవళ్ల సంభాషణ వీడియోను రేవంత్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు...బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు..అంటూ రేవంత్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.