45 ఎకరాలు మిస్సింగ్.. BRSలో గుబులు స్టార్ట్‌.!

admin
Published by Admin — October 07, 2026 in Politics, Telangana
News Image

మనిషి కనిపించకపోతే మిస్సింగ్ అంటాం, పెంపుడు జంతువులు పోతే వెతుకుతాం. కానీ ఏకంగా 45 ఎకరాల భూమి కళ్లముందే మాయమైపోతే ఏమనాలి? ఎక్కడ వెతకాలి? సరిగ్గా ఇదే సస్పెన్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఈ ల్యాండ్ మిస్టరీకి కేసీఆర్(KCR) ఫామ్‌హౌస్ ఉన్న ఎర్రవల్లి కేంద్రబిందువుగా మారడం విశేషం.

రెవెన్యూ రికార్డుల(Revenue Records) లెక్కల ప్రకారం సర్వే నెంబర్ 325లో దాదాపు 388 ఎకరాల విస్తీర్ణం ఉండాలి. కానీ, ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ లెక్క తేల్చేసరికి కేవలం 343 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నట్లు తేలింది. మరి ఆ లెక్కలో పడకుండా గల్లంతైన ఆ మిగతా 45 ఎకరాలు ఎక్కడికి వెళ్లాయి? ఆ భూములు ఎవరి చేతుల్లోకి వెళ్లాయనే ప్రశ్న ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ క్రమంలోనే రంగం సిద్ధం చేసుకున్న రెవెన్యూ యంత్రాంగం.. ఎర్రవల్లి(Erravelli)లో కేసీఆర్‌తో సహా పలువురికి త్వరలోనే అధికారిక నోటీసులు జారీ చేసేందుకు పావులు కదుపుతోంది. భూ రికార్డులను కూలంకషంగా పరిశీలించి, అసలు ఆ 45 ఎకరాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయో తేల్చడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఒకవేళ ఈ ఆక్రమిత భూములు గనుక కేసీఆర్ ఫామ్‌హౌస్ కాంపౌండ్ వాల్ లోపలే ఉన్నట్లు తేలితే మాత్రం, రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా తలకిందులు కావడం ఖాయం.

ఈ పరిణామం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మరో భారీ పొలిటికల్ వార్‌కు తెరలేపనుంది. ఈ భూములను విజయవంతంగా వెనక్కి తీసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి అది పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ అవుతుంది. ప్రభుత్వ లేదా పేదల అసైన్డ్ భూములను గులాబీ బాస్ ఆక్రమించారనే వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వం సఫలమైతే, అది నేరుగా కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉంది. అయితే, దీనిని కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యగానే తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సైతం వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలపై గులాబీ శ్రేణులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ రాజకీయ పోరు ముగిసేసరికి ఎవరి వ్యూహాలు పైచేయి సాధిస్తాయి? 45 ఎకరాల మిస్సింగ్ మిస్టరీకి తెరపడి ఆ భూములు మళ్లీ ప్రభుత్వ ఖాతాలోకి చేరతాయా? లేదా రెండు పార్టీల మధ్య రాజీ కుదురుతుందా? అన్నది చూడాలి.

Tags
Erravelli Land Mystery KCR Farmhouse Revanth Reddy Telangana Politics BRS Congress 45 Acres
Recent Comments
Leave a Comment

Related News