ఎస్ ఐఆర్ ప్రక్రియపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. సీఈసీ జ్నానేష్ కుమార్, ప్రధాని మోదీ కలిసి ఓట్లు తొలగించాలని ప్లాన్ చేశారని రేవంత్ విమర్శించారు.
ఈ క్రమంలోనే నిన్న ఢిల్లీ వెళ్లిన రేవంత్...మరోసారి బీజేపీపై మండిపడ్డారు. ఓటమి భయంతోనే పేదల ఓటు హక్కును హరించాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. పేదలు, దళితులు, గిరిజనులు, ఓబీసీలు, మైనారిటీలు బీజేపీకి వ్యతిరేకంగా మారారని, అందుకే వారి ఓట్లు దొంగిలించాలని చూస్తోందని ఆరోపించారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఇండియా కూటమి చేపట్టిన నిరసనలో రేవంత్ రెడ్డి వరుసగా రెండో రోజు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ, ఇతర కూటమి నేతలతో కలిసి ఆయన ధర్నాలో కూర్చున్నారు. మతం, కులం, ప్రాంతం, భాష పేరుతో భారతీయులను విభజించడానికి బీజేపీ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకు, సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని తేలడంతో ఓటు హక్కు ఉన్నవారు, ఓటు చోరీకి గురైన వారు అంటూ దేశాన్ని రెండు వర్గాలుగా విభజిస్తోందని ఆరోపణలు గుప్పించారు.
సుమారు 13 కోట్ల మంది పౌరుల ఓట్లను తొలగిస్తే, అది ప్రపంచంలోనే అతిపెద్ద ఓటు హక్కు హరణ ప్రక్రియ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 1952 నుంచి జరిగిన ప్రతి ఎన్నికలో ఓటర్ల సంఖ్య పెరిగితే, రాబోయే ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య తగ్గే విచిత్రమైన పరిస్థితి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ పోరాటం కేవలం కాంగ్రెస్ లేదా ఇండియా కూటమిది కాదని, దేశ భవిష్యత్తుకు సంబంధించినదని అన్నారు. బ్రిటిష్ వారి 'విభజించు-పాలించు' ఎత్తుగడలతో ప్రధాని మోదీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు.