అఖిల్‌కు కొత్త పేరు.. ఇక‌పై అలానే పిల‌వాల‌ట‌..!

admin
Published by Admin — July 06, 2026 in Movies
News Image

సినీ పరిశ్రమలో సెంటిమెంట్లు, పేరు మార్పులు కొత్తేమీ కాదు. కేవలం ఒక అక్షరం మార్చడం వల్ల లేదా పేరును కాస్త అటు ఇటు చేయడం వల్ల రాత మారిన స్టార్ హీరోలు ఎందరో ఉన్నారు. అయితే సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు జ్యోతిష్య నిపుణులో లేదా కుటుంబ సభ్యులో తీసుకుంటారు. కానీ, అక్కినేని యువ కథానాయకుడు అఖిల్(Akhil) విషయంలో మాత్రం ఒక వీరాభిమాని ఊహించని ప్రతిపాదన తెచ్చాడు. అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం 'లెనిన్' ప్రమోషన్లలో భాగంగా తిరుపతిలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ సీన్‌ చోటుచేసుకుంది.

మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన 'లెనిన్(Lenin)' సినిమా ఈ నెల 10న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తిరుపతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. వేలాదిగా తరలివచ్చిన అభిమానుల కోలాహలంతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. స్టేజ్ మీద నాగార్జున, అఖిల్ మాట్లాడిన మాటలు ఒకెత్తయితే.. మైక్ పట్టుకున్న ఒక అక్కినేని వీరాభిమాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. అఖిల్ పేరును ఇకపై 'నాగ అఖిల్'గా మార్చాలని, అందరూ అలానే పిలవాలని ఆ ఫ్యాన్ కోరాడు.

కేవలం పేరు మార్చమని చెప్పడమే కాదు.. ఆ పేరు వెనుక ఉన్న ఒక అద్భుతమైన ఫ్యామిలీ సెంటిమెంట్‌ను సదరు అభిమాని వివరించిన తీరు అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. 'నాగ అఖిల్' అనే పేరులో అక్కినేని వంశానికి చెందిన నలుగురు ముఖ్యుల ఆశీస్సులు దాగున్నాయి. మొదటగా ఉండే 'నాగ' అనే పదం తాతగారైన లెజెండ్ నాగేశ్వరరావు, తండ్రి నాగార్జున(Nagarjuna)ల పేర్ల నుంచి వచ్చింది. ఇక 'అఖిల్'లో మొదటి అక్షరమైన 'అ'.. నానమ్మ అన్నపూర్ణమ్మ, తల్లి అమలల పేర్లను సూచిస్తుంది. ఇలా ఒకే పేరులో అమ్మ, నాన్న, తాత, నానమ్మల దీవెనలు కలగలిసి ఉన్నాయని ఆ ఫ్యాన్ వివరించడంతో స్టేడియంలో ఉన్న‌వారంతా హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

నిజానికి అక్కినేని వారసత్వంలో 'నాగ' అనే పదానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్, బ్రాండ్ వాల్యూ ఉన్నాయి. నాగేశ్వరరావు గారి నుండి నాగార్జున, నాగ చైతన్య(Naga Chaitanya), నాగ సుశీల వరకు అందరి పేర్లలోనూ అది భాగమైంది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను అఖిల్‌కు కూడా వర్తింపజేస్తూ అభిమాని ఇచ్చిన ఈ ఐడియాకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మ‌రి 'నాగ అఖిల్' అనే పేరు నిజంగానే లక్కీ చామ్‌గా మారుతుందేమో చూడాలి.

Tags
Akhil Akkineni Naga Akhil Lenin Movie Akkineni Family Lenin Pre Release ANR Tollywood
Recent Comments
Leave a Comment

Related News