టాలీవుడ్‌లో ఎంతమంది హీరోలు ఉన్నా.. కొందరి మధ్య ఉండే బంధం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి వారిలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, అక్కినేని యంగ్ హీరో అఖిల్(Akhil Akkineni) ఒకరు. చరణ్‌కు సొంత తమ్ముడు లేకపోవడంతో, చిన్నప్పటి నుండి అఖిల్‌ను తన సొంత తమ్ముడిలాగే చూసుకుంటూ వస్తున్నారు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల హీరోలు పలు సందర్భాల్లో ఇప్పటికే ప్రస్తావించారు. తాజాగా అఖిల్ చేసిన కొన్ని కామెంట్స్ చూస్తే వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఎంత స్ట్రాంగో మరోసారి అర్థమవుతుంది.
దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అఖిల్ అక్కినేని 'లెనిన్(Lenin)' సినిమాతో త్వరలోనే వెండితెరపై సందడి చేయబోతున్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో, భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ భారీ చిత్రం జులై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. వరుస ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అఖిల్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఇటీవలే విడుదలైన రామ్ చరణ్ సరికొత్త చిత్రం 'పెద్ది(Peddi)' చూశానని అఖిల్ ఈ సందర్భంగా తెలిపారు. సినిమా చూస్తున్నంత సేపు స్క్రీన్‌పై తనకు రామ్ చరణ్ గారు ఎక్కడా కనిపించలేదని, కేవలం పెద్ది పాత్ర మాత్రమే కనిపించిందని ప్రశంసల వర్షం కురిపించారు. చరణ్ గారు ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారని, ఆయనో నిజమైన స్టార్ అంటూ కొనియాడారు. అయితే, ఈ ముచ్చట్లలో చరణ్ పేరు పక్కన 'గారు' అని చేర్చడంతో యాంకర్ స్పందించగా.. అఖిల్ నవ్వుతూ అసలు విషయం బయటపెట్టారు.
రామ్ చరణ్(Ram Charan)ను అంత మర్యాదగా పిలవడంపై అఖిల్ స్పందిస్తూ.. "మేమిద్దరం అన్నదమ్ముల్లా ఉంటాం. ఒకవేళ పొరపాటున కూడా నేను ఆయన్ను చరణ్ గారు అని పిలిస్తే.. నన్ను చితక్కొడతాడు" అంటూ క్రేజీ కామెంట్స్ చేశారు. గౌరవం మనసులో ఉంటే చాలని, పిలుపుల్లో కాదని వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించారు. ప్రస్తుతం అఖిల్ చేసిన ఈ కామెంట్స్ మెగా, అక్కినేని అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. మరి 'లెనిన్' చిత్రంతో అఖిల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.