ఏపీలో షూటింగ్ లకు బాలయ్య పిలుపు

admin
Published by Admin — May 24, 2026 in Movies
News Image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటక అభివృద్ధి సంస్థ (APFDC) కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇది సినీ ఇండస్ట్రీకి కొత్త అధ్యాయం అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమ్ముడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి కందుల దుర్గేష్‌లతో కలిసి టాలీవుడ్ పురోగతి కోసం తామంతా కృషి చేస్తున్నామని తెలిపారు.

తెలుగు సినిమాల మొత్తం కలెక్షన్లలో సుమారు 70 శాతం ఆదాయం ఏపీ నుంచే వస్తోందని అన్నారు. ఏపీలో అద్భుతమైన సహజ లొకేషన్లు అందుబాటులో ఉన్నాయని, తాను నటించిన ‘అఖండ’ చిత్రపు షూటింగ్ కూడా రంపచోడవరంలోనే జరిపామని చెప్పారు. 

తాను చేసినన్ని సినిమాలు ఏపీలో బహుశా మరెవరూ చేసి ఉండరని అన్నారు. షూటింగ్‌లకు సింగిల్ విండో అనుమతి వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. అందుకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. 

ప్రస్తుతం సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో టెక్నాలజీ లేనప్పుడు కూడా సినిమాలు త్వరగా పూర్తయ్యేవని, ఇప్పుడు అధునాతన సాంకేతికత ఉన్నా నిర్మాణంలో ఆలస్యం జరుగుతోందని విచారం వ్యక్తం చేశారు. షూటింగ్‌లు తగ్గడంతో అనేక సినీ యూనియన్లు పనులు లేక ఇబ్బంది పడుతున్నాయని, చాలా మంది పంపిణీదారులు థియేటర్లకు తాళాలు వేసుకునే దారుణ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు.

ఒకప్పుడు సినిమా ఎలా ఉండాలో ఆలోచించేవాళ్లమని, కానీ ఇప్పుడు పరిశ్రమను బ్రతికించాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. నిర్మాతలు ఎక్కువ సినిమాలు తీసి థియేటర్లను బ్రతికించాలని పిలుపునిచ్చారు.

Tags
Film shootings ap balakrishna
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News