వైసీపీపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఆ పార్టీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన ఆయన.. మరోసారి అదికారంలోకి వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ``గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్`` అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆ పార్టీని గొడ్డలి పార్టీ అని ఎందుకు పిలుస్తున్నారో కూడా చెప్పారు. పుట్టిన రోజు నాడు బహిరంగంగా జంతువులను నరికి ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసిన పార్టీని ఏమని పిలవాలని ప్రశ్నించారు. రప్పా.. రప్పా.. నరుకుతాం.. అని రంకెలు వేసే పార్టీని ఏమని పిలవాలని నిలదీశారు. ఈ పార్టీకి ప్రజలు మరోసారి ఎట్టి పరిస్థితిలోనూ ఓటేయరని వ్యాఖ్యానించారు.
చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. సంజీవని ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లా డుతూ.. చంద్రబాబు దగ్గర గొడ్డలి పార్టీ తోడ ఝాడింపులు కుదరవని ఘాటుగా హెచ్చరించారు. ప్రజల సంక్షేమం కోసం .. తాము ప్రయత్నిస్తున్నామని.. ప్రజల మేలు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని చెప్పారు. ఇలాంటి సమయంలో గొడ్డలి పార్టీ అరాచకాలను ఎట్టిపరిస్థితిలోనూ సాగనివ్వబోమన్నారు. ఈ పార్టీ విషయంలో ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో అరాచకాలకు చోటు లేదన్న.. చంద్రబాబు, గొడ్డలి పార్టీకి కూడా చోటు ఉండదని అన్నారు.
జగన్ రోజుకో నాటకం!
జగన్ రోజుకొక నాటకం ఆడుతున్నారని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజల మేలు కోసం పనిచేస్తుం టే.. ఆయన మాత్రం కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని.. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నట్టు విమర్శించారు. అసత్య ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలనేది గొడ్డలి పార్టీ వ్యూహంగా ఉందన్నారు. కోడి కత్తి, గులకరాయి నాటకాలు ఎవరూ మరిచిపోలేదని తెలిపారు. డ్రైవర్ సుబ్రమణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వారిని సన్మానించే పార్టీలను గొడ్డలి పార్టీలనక ఏమనాలని నిలదీశారు. తల్లి, చెల్లికి ఆస్తులివ్వకుండా వేధించారని జగన్‌పై విరుచుకుపడ్డారు.
``తల్లికి చెల్లికి ఆస్తుల్లో భాగం ఇవ్వాల్సి ఉంటుందని ఇంటి నుంచి గెంటేశాడు. అలాంటి వాడు ప్రజలకు ఏం చేస్తాడు.`` అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని.. ఇది చూసి గొడ్డలి పార్టీ తట్టుకోలేక పోతోందని వ్యాఖ్యానించా రు. అయినప్పటికీ.. ప్రజలను నమ్మించలేరన్నారు. తమాషాలు పోతే.. తోకలు కట్ చేసేందుకు చంద్రబాబు ఉన్నారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. తాను ప్రజలకోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న చంద్రబాబు.. ప్రజలు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. వారికి సేవ చేస్తున్నానని తెలిపారు.