ఈ మధ్య స్టార్ హీరోలు.. తమ కొత్త చిత్రాల విడుదల ముంగిట ప్రత్యేకంగా అభిమానులను కలవడం.. వారికి ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం ట్రెండుగా మారిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సినిమా రిలీజ్‌కు లేకపోయినా, కొన్ని నెలల ముందు రిజిస్టర్డ్ ఫ్యాన్స్ కోసం ఒక మీట్ పెట్టి ఫొటోలు ఇవ్వడమే కాదు.. వారికి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కార్డులు కూడా అందించాడు.
ఇక ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌కి ముందు నాని, ‘రణబాలి’ విడుదలప్పుడు విజయ్ దేవరకొండ కూడా అభిమానులను కలిసి ఫొటోలు ఇచ్చి సంతోషంలో ముంచెత్తారు. ఇప్పుడు మరో యంగ్ హీరో విశ్వక్సేన్ కూడా ఇదే బాటలో సాగాడు. వచ్చే శుక్రవారం తన సినిమా ‘కల్ట్’ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆదివారం రోజు ఫ్యాన్స్‌తో ఫొటో షూట్ పెట్టుకున్నాడు. కానీ ఈ కార్యక్రమాన్ని సరిగా ఆర్గనైజ్ చేయకపోవడం, అభిమానులు అనుకున్న దాని కంటే ఎక్కువగానే రావడంతో ఫ్యాన్ మీట్ రసాభాసగా మారిపోయింది.
ఉదయం వచ్చిన అభిమానులకు విశ్వక్సేన్ కొంచెం ఓపిగ్గానే ఫొటోలు ఇచ్చాడు. కొన్ని మధ్యాహ్నానికి పరిస్థితి అదుపు తప్పింది. ముందుగా పాస్‌లు ఇచ్చి వాటితో వచ్చిన వారికే ఫొటోలు ఇచ్చేలా ప్లాన్ చేశారు. కానీ విశ్వక్ ఫ్యాన్ మీట్ జరుగుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వాళ్లు, ఈ ప్రాంతంలో చుట్టుపక్కల వాళ్లు పెద్ద ఎత్తున వచ్చేయడంతో క్రౌడ్‌ను అదుపు చేయడం కష్టమైంది. క్రౌడ్‌ను ఆర్గనైజ్డ్‌గా లోపలికి పంపేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయకపోవడంతో కాసేపటికే పరిస్థితి అదుపు తప్పింది. ఒక్కసారిగా జనం పోటెత్తడంతో విశ్వక్ అండ్ టీం కంగారెత్తిపోయింది. దీంతో విశ్వక్ మధ్యలోనే ఫ్యాన్ మీట్ రద్దు చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇలాంటి ఈవెంట్లు చేసేటపుడు ఏర్పాట్లు ఇంకాస్త పకడ్బందీగా చేసుకోవాల్సిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐతే కొందరేమో యూత్‌లో తన క్రేజ్ చూపించుకోవడానికే విశ్వక్ ఇలా చేశాడంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తుండడం గమనార్హం.